Job Calendar | ప్రియాంక జీ.. రేవంత్‌కు మొట్టికాయలు వేయాల్సిందే : హరీశ్ రావు

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : ఎన్నికల మందు జాబ్ క్యాలెండర్ విడుద‌ల చేస్తామ‌ని సీఎం రేవంత్ రెడ్డి హ‌డావుడి చేశార‌ని, ఇప్పుడు అది ఎక్కడికి పోయింద‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ప్ర‌శ్నించారు. శ‌నివారం నాడు తెలంగాణ భవన్‌ లో నిరుద్యోగులు ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమ పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ మద్దుతు ఇవ్వాలని కోరారు. అనంతరం హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున యువతకు సంపూర్ణ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లక్షా 62 వేల ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేశారు.

ప్రియాంక జీ.. సీఎంకు మొట్టికాయలు వేయాలి..

ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రానికి వచ్చిన ప్రియాంక గాంధీ ఏడాదిలోపు అన్ని ఉద్యోగాల భర్తీకి మాటిస్తున్నానని చెప్పారనే విషయాన్ని హరీశ్ రావు గుర్తు చేశారు. అదేవిధంగా ఐదు అంశాలతో కూడిన యూత్ డిక్లరేషన్ ను ఆమె చేతుల మీదుగా విడుదల చేయించారని తెలిపారు. యువత ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి బాధ్యత తీసుకున్న ప్రియాంక గాంధీ ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. ఇర‌వై నెలలు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌పై ఎలాంటి ప్రకటన చేయడం లేదని.. ఈ విషయంలో గాంధీల కుటుంబ గౌరవం, పరువు పోతోందని ప్రియాంక, సీఎం రేవంత్‌కు రెండు మొట్టికాయలు వేసి అడగాలని సూచించారు. యూత్ డిక్లరేషన్‌లో ఐదు అంశాలు చెప్పారని.. అందులో ఏ ఒక్కటి అమలు కాలేదని ఆక్షేపించారు. అమరుల కుటుంబాలకు నెలకు రూ.25 వేల‌ పెన్షన్, ఉద్యోగం అన్నారని.. అందుకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అధికారంలోకి వచ్చిన తొలి యేడులోని ఇస్తామని చెప్పి మోసం చేశారని ధ్వజమెత్తారు. యువతులకు స్కూటీలు ఇస్తామని చెప్పి.. దోఖా చేశారని ఆరోపించారు.

Leave a Reply