ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవ రాట ప్రతిష్ఠ..
గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ పట్టణంలోని మెయిన్ రోడ్డులో ప్రసిద్ధిగాంచిన శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించనున్న గణపతి నవరాత్రి మహోత్సవాలకు సంబంధించిన ఉత్సవ రాట ప్రతిష్ఠ కార్యక్రమాలు సోమవారం ఉదయం శాస్త్రోక్తంగా జరిగాయి. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముహూర్త సమయానికి ఆలయ కమిటీ చైర్మన్ సాయన రాజేష్, ఈవో యార్లగడ్డ వాసు, ధర్మకర్తల కమిటీ సభ్యులు, భక్తులు ఉత్సవ రాటను ప్రతిష్ఠించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, జనసేన ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్, సీనియర్ టీడీపీ నాయకులు లింగం ప్రసాద్, చేకూరు జగన్మోహన్రావు రాట ప్రతిష్ఠ పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ రాజేష్, ఈవో వాసు మాట్లాడుతూ.. సెప్టెంబర్ 14 నుంచి 22 వరకు స్వామివారి గణపతి నవరాత్రి మహోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 23న నిమజ్జన ఊరేగింపు, అక్టోబర్ 4న మహా అన్న సమారాధన నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వేడుకల్లో భక్తులందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.
అనంతరం యలవర్తి శ్రీనివాసరావు, బూరగడ్డ శ్రీకాంత్, లింగం ప్రసాద్ మాట్లాడుతూ.. గుడివాడతో పాటు పరిసర ప్రాంతాల్లో ఎంతో ప్రసిద్ధిగాంచిన ప్రాచీన శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో దశాబ్దాలుగా స్వామివారి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని తెలిపారు. ఉత్సవ వేడుకలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో గుడివాడతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనడం ఆనవాయితీగా వస్తోందన్నారు.
ఈ ఏడాది కూడా స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ నవరాత్రి మహోత్సవాలను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు యర్రపోతు అర్జున్, భక్తులు సాయన గాంధీ, రెడ్డి షణ్ముఖ్, ఆలయ ధర్మకర్తల కమిటీ సభ్యులు లోయ వాసు, పంచుమర్తి, ముళ్లపూడి రమణమూర్తి, విక్కుర్తి పోతురాజు, వీరమాచినేని శైలజ, చాపరాల విజయలక్ష్మి, సోసుపల్లి శారద, గొంతుపుల్లి కనకదుర్గ, గణపతి శాస్త్రి, పలువురు భక్తులు పాల్గొన్నారు.
