జాతీయ రహదారిపై బీఆర్‌ఎస్ నాయకుల ధర్నా, రాస్తారోకో
తాడ్వాయి, ఆంధ్రప్రభ : పేద ప్రజల కష్టాలను తెలుసుకుని, ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. బీఆర్‌ఎస్ పార్టీ ఆదేశాల మేరకు తాడ్వాయి మండల కేంద్రంలోని బస్‌స్టాండ్ వద్ద 163వ జాతీయ రహదారిపై బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ధర్నా, రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు.
అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో బీఆర్‌ఎస్ నాయకులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ప్రవళిక గున్ను, సీనియర్ నాయకులు పిన్నింటి యాదిరెడ్డి, మాజీ ఉపసర్పంచ్ అలేటి ఇంద్రారెడ్డి, మాజీ మండల ప్రధాన కార్యదర్శి పోగు నగేష్, పత్తి గోపాల్‌రెడ్డి, సురేందర్ ఠాకూర్, మాజీ ఎంపీపీ పాయం నర్సింగారావు, నవీన్, మనోజ్‌రెడ్డి, చింతల కొమురయ్య, శ్రీరాములు తదితర సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
