జూడాల సమరభేరి..
అత్యవసర వైద్య సేవలకూ బ్రేక్!
స్టైఫండ్ పెంపుపై రాతపూర్వక హామీ కోసం ఆందోళన
నేటి నుంచి ఐసీయూ, క్యాజువాలిటీ, లేబర్ రూమ్‌ల విధుల బహిష్కరణ
జనవరి 1 నుంచే పెరగాల్సిన 15 శాతం స్టైఫండ్..
ఏడు నెలలుగా పెండింగ్ అంటూ ఆరోపణలు
30 శాతం వరకు పెంచాలని జూడాల డిమాండ్..
సమ్మెకు ఏపీ ఐఎంఏ మద్దతు
వైద్య సేవలకు అంతరాయం కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
విజయవాడ, ఆంధ్రప్రభ : స్టైఫండ్ పెంపుపై ప్రభుత్వం నుంచి రాతపూర్వక హామీ రాకపోవడంతో ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్లు సమరభేరి మోగించారు. ఇప్పటివరకు దశలవారీగా చేపట్టిన నిరసనలను మరింత ఉధృతం చేస్తూ సోమవారం ఆందోళన మరింత ఉదృతం చేశారు. ఇందులో భాగంగా ఐసీయూ, క్యాజువాలిటీ, అత్యవసర వైద్య సేవలు, లేబర్ రూమ్‌లలో విధులను సైతం బహిష్కరించేందుకు జూడాలు నిర్ణయించారు. దీంతో రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనాసుపత్రులు, అనుబంధ ఆసుపత్రుల్లో వైద్య సేవలపై ప్రభావం పడే అవకాశం ఉంది.
ఏడు నెలలుగా ఎదురుచూపులే..
నిబంధనల ప్రకారం జనవరి 1, 2026 నుంచి అమలు కావాల్సిన 15 శాతం స్టైఫండ్ పెంపు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని జూనియర్ డాక్టర్లు చెబుతున్నారు. స్టైఫండ్ సరిపోవడం లేదని, పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా కనీసం 15 నుంచి 30 శాతం వరకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి రెండేళ్లకోసారి స్టైఫండ్‌ను సవరించాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తోందని ఆరోపిస్తున్నారు.
చర్చలు ఎన్నో.. హామీ మాత్రం లేదు…
స్టైఫండ్ పెంపుతో పాటు ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పన తదితర సమస్యలను ప్రభుత్వం దృష్టికి పలు దఫాలుగా తీసుకెళ్లినట్లు జూడా ప్రతినిధులు తెలిపారు. వైద్య విద్యాశాఖ, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో పాటు మంత్రి స్థాయిలోనూ చర్చలు జరిగినప్పటికీ తమ డిమాండ్లపై స్పష్టమైన రాతపూర్వక హామీ రాలేదని పేర్కొన్నారు. తొలి దశలో నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరైన జూడాలు.. రెండో దశలో కొన్ని విభాగాల విధులను బహిష్కరించారు. అయినా ప్రభుత్వం నుంచి స్పష్టమైన స్పందన లేకపోవడంతో ఇప్పుడు అత్యవసర సేవల బహిష్కరణ వరకు ఆందోళనను తీసుకెళ్లారు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో ప్రభుత్వం…
జూడాల సమ్మె ప్రభావం రోగులపై పడకుండా ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. సెలవుల్లో ఉన్న వైద్యులను తిరిగి విధుల్లోకి రావాలని ఆదేశించింది. సాధారణ సెలవులను రద్దు చేయడంతో పాటు కొత్తగా సెలవులు మంజూరు చేయకుండా వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లు, ఆసుపత్రుల సూపరింటెండెంట్లకు సూచనలు చేసింది. డీఎంఈ, డీహెచ్ఎస్ పరిధిలోని వైద్యులను అవసరమైన చోట వినియోగించుకోవాలని ఆదేశించింది. పీహెచ్‌సీలు, జనరల్ ఆసుపత్రులు, బోధనాసుపత్రుల్లో వైద్య సేవలు నిరంతరాయంగా కొనసాగేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేసింది.
జూడాలకు ఐఎంఏ అండ…
జూనియర్ డాక్టర్ల ఆందోళనకు ఆంధ్రప్రదేశ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మద్దతు ప్రకటించింది. స్టైఫండ్ పెంపు సమస్యను తక్షణమే పరిష్కరించాలని, ఆరోగ్యశాఖ మంత్రి జోక్యం చేసుకుని జూడా ప్రతినిధులతో చర్చలు జరపాలని కోరింది. ప్రభుత్వం నుంచి రాతపూర్వక హామీ వచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని జూడాలు స్పష్టం చేయడంతో.. ఫేజ్–3 సమ్మెపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.
