ఆస్పత్రిలో వ్యక్తి మృతి.. వైద్యుల నిర్లక్ష్యంపై ఆరోపణలు

స్టెంట్ పేరుతో రూ.3.75 లక్షలు వసూలు చేశారని బంధువుల ఆరోపణ..

ఆస్పత్రి ఎదుట ఆందోళన

మహబూబ్‌నగర్, ఆంధ్రప్రభ: మహబూబ్‌నగర్ పట్టణంలోని అభయప్రద ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం, అధిక బిల్లుల వసూళ్ల కారణంగానే తమ బంధువు మృతి చెందారని ఆరోపిస్తూ మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. రాజాపూర్ మండలం కొచ్చర్కల్ గ్రామానికి చెందిన పాండురాయ గౌడ్ మంగళవారం అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని ఆసరాగా చేసుకుని అత్యవసరంగా స్టెంట్ వేయాలని ఆస్పత్రి యాజమాన్యం ఒత్తిడి చేసిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆరోగ్యశ్రీ సౌకర్యం ఉన్న మరో ఆస్పత్రికి ఎలాంటి ఖర్చు లేకుండా తీసుకెళ్తామని కోరినా పట్టించుకోకుండా స్టెంట్ పేరుతో రూ.3.75 లక్షలు వసూలు చేశారని తెలిపారు. స్టెంట్ వేసిన అనంతరం పాండురాయ గౌడ్‌కు సమగ్ర వైద్యం అందించకుండానే ఇంటికి పంపించారని ఆరోపించారు. ఇంటికి వెళ్లిన తర్వాత ఆయన వాంతులు, విరేచనాలతో పాటు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, ఈ విషయాన్ని ఆస్పత్రి సిబ్బందికి తెలియజేసినా నేరుగా వచ్చి పరిశీలించకుండా వాట్సాప్ ద్వారా మందుల చీటీలు పంపుతూ కాలయాపన చేశారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

పరిస్థితి విషమించడంతో పాండురాయ గౌడ్‌ను సోమవారం తిరిగి అదే ఆస్పత్రికి తీసుకువచ్చారు. చికిత్స పొందుతున్న సమయంలోనే ఆయన మృతి చెందారు. వైద్యుల నిర్లక్ష్యం, సరైన వైద్యం అందకపోవడమే మృతికి కారణమని ఆరోపిస్తూ బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. బాధ్యులైన వైద్యులు, ఆస్పత్రి యాజమాన్యంపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరగకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. కాగా, మృతుడి బంధువులు చేసిన ఆరోపణలు, వారి డిమాండ్లపై ఆస్పత్రి యాజమాన్యం వివరణ తెలియాల్సి ఉంది.