గ్రామ పంచాయతీ ఎన్నికలకు కసరత్తు.. ఓటర్ల జాబితాల సిద్ధతకు ఆదేశాలు
- జనవరి 1, 2026 అర్హత తేదీగా ఓటర్ల జాబితాల రూపకల్పన
- ఈ నెల 31న తుది పోలింగ్ కేంద్రాల జాబితా
ఆంధ్రప్రభ, ఏలూరు: రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలకు రెండో సాధారణ ఎన్నికల నిర్వహణకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఓటర్ల జాబితాల సిద్ధతకు సంబంధించి జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వీ అధికారులకు పలు సూచనలు చేశారు.
జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలకు జనవరి 1, 2026ను అర్హత తేదీగా పరిగణించి ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన సంఖ్యలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి, వాటి జాబితాను నిర్ణీత గడువులో ప్రచురించాలని సూచించారు.
31న పోలింగ్ కేంద్రాల తుది జాబితా..
గ్రామ పంచాయతీలకు రెండో సాధారణ ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాలను మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, తహసీల్దార్లు సంయుక్తంగా తనిఖీ చేయాలని కలెక్టర్ సూచించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాలను గుర్తించి జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు.
ఈ నెల 21వ తేదీలోగా పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను రూపొందించి, 23న ప్రచురించాలి. 26వ తేదీలోగా అభ్యంతరాలు, విజ్ఞప్తులను స్వీకరించాలి. 29న వాటిని పరిశీలించి ఆమోదించిన అనంతరం 31వ తేదీన పోలింగ్ కేంద్రాల తుది జాబితాను ప్రచురించాలి.
ప్రతి వార్డుకు కనీసం ఒక పోలింగ్ కేంద్రం
ఎన్నికల మార్గదర్శకాల ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీలోని ప్రతి వార్డుకు కనీసం ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అధికారులు తెలిపారు. ఓటర్ల సంఖ్యను బట్టి ఒక వార్డులో ఒకటి కంటే ఎక్కువ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటుంది. సుమారు 600 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం ఉండేలా చూడాలని సూచించారు.
ఒక వార్డులో ఓటర్ల సంఖ్య 1,300కు మించితే మూడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఏ, బీ, సీ కేంద్రాలుగా విభజించాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
ఓటర్లకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు..
సాధ్యమైనంత వరకు గత సాధారణ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రదేశాల్లోనే ఈసారి కూడా కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు సూచించారు. దీంతో ఓటర్లు తమకు పరిచయమైన ప్రాంతంలోనే ఓటు వేసే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఏ ఓటరూ ఓటు వేయడానికి రెండు కిలోమీటర్లకు మించి ప్రయాణించాల్సిన అవసరం లేకుండా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, తహసీల్దార్లు సమన్వయంతో పనిచేసి రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
