బ్రిటిష్‌ కాలం నాటి భవనానికి రక్షణ కరువు

లైట్లు ఏర్పాటు చేయాలి.. రక్షణ గోడ నిర్మించాలి : గ్రామస్థుల డిమాండ్

కామవరపుకోట, ఆంధ్రప్రభ: మండల కేంద్రంలోని రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహం అధికారుల అలసత్వానికి, నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. సుమారు 3.50 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఉన్న ఈ విలువైన ప్రభుత్వ ఆస్తి నేడు సరైన నిర్వహణ, పర్యవేక్షణ లేక పాడుబడిపోతోంది. ఈ ఆవరణలో దాదాపు 80 ఏళ్ల క్రితం బ్రిటిష్‌ కాలంలో విశిష్ట నిర్మాణ శైలి, అద్భుత ఇంజనీరింగ్‌ ప్రమాణాలతో నిర్మించిన చారిత్రాత్మక అతిథి గృహం ఉంది.

ఒకప్పుడు ఈ ప్రాంతానికి వచ్చే ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులకు విడిదిగా నిలిచిన ఈ భవనం.. నేడు అధికారుల నిర్లక్ష్యంతో పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. స్వల్పంగా వర్షం కురిసినా పైకప్పు నుంచి భవనం లోపలికి నీరు కారుతున్న పరిస్థితి నెలకొంది. దీనికితోడు ప్రభుత్వ స్థలానికి చుట్టూ రక్షణ గోడ లేకపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది.

80 ఏళ్ల చరిత్ర.. కళ్లముందే శిథిలం

బ్రిటిష్‌ కాలం నాటి నిర్మాణ శైలికి ప్రతీకగా నిలిచిన ఈ భవనం ఒకప్పుడు ప్రత్యేక ఆకర్షణగా ఉండేది. ప్రస్తుతం సరైన నిర్వహణ లేకపోవడంతో గోడలు, పైకప్పు తదితర నిర్మాణాలు దెబ్బతింటున్నాయని స్థానికులు చెబుతున్నారు. చారిత్రాత్మక విలువ కలిగిన ఈ భవనాన్ని కాపాడాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విశాలమైన ఆవరణలో మామిడి చెట్లు, ముళ్లకంపలు విపరీతంగా పెరిగి అపరిశుభ్రంగా మారింది. వర్షపు నీరు అక్కడక్కడా నిలిచిపోవడంతో దోమలు వృద్ధి చెందుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. దీంతో పరిసర ప్రాంతాల్లో విషజ్వరాలు వ్యాపించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రాత్రయితే గాఢాంధకారం..

ఆవరణలో రాత్రి వేళల్లో కనీసం దీపాలు కూడా వెలగకపోవడంతో ప్రాంతమంతా గాఢాంధకారంలో మునిగిపోతోంది. రక్షణ గోడ లేకపోవడం, చుట్టూ పెరిగిన పొదలు, చీకటి కారణంగా ఈ ప్రాంతం విషసర్పాలు, తేళ్లకు ఆవాసంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. దీంతో చుట్టుపక్కల నివసించే ప్రజలు ఏ సమయంలో విషసర్పాలు ఇళ్లలోకి వస్తాయోనని భయాందోళనకు గురవుతున్నారు.

కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తి, చారిత్రాత్మక భవనం అధికారుల కళ్లముందే శిథిలావస్థకు చేరుతున్నా యంత్రాంగం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి భవనాన్ని, ఆవరణను పరిరక్షించాలని కోరుతున్నారు.

రక్షణ గోడ.. దీపాలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌

ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ఆవరణలోని ముళ్లకంపలను తొలగించి పరిశుభ్రం చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. చుట్టూ బలమైన రక్షణ గోడ నిర్మించడంతో పాటు రాత్రి వేళల్లో వెలుగులు ఉండేలా దీపాలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. అంతేకాకుండా బ్రిటిష్‌ కాలం నాటి ఈ చారిత్రాత్మక భవనానికి మరమ్మతులు చేపట్టి, పునరుద్ధరించి పూర్వ వైభవం తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు