చైనాతో డ్రా.. ప్చ్ గెలవాల్సిన మ్యాచ్ కాస్తా !!
ఆంధ్రప్రభ : ఎఫ్ఐహెచ్ మహిళల హాకీ ప్రపంచకప్‌లో భారత జట్టు గెలవాల్సిన మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. చైనాతో ఆదివారం జరిగిన పూల్-డి మ్యాచ్‌లో ఒక దశలో 2-1తో ఆధిక్యంలో ఉన్న భారత్.. చివరి రెండు క్వార్టర్లలో పట్టుసడలించింది. ప్రత్యర్థి ఒత్తిడిని తట్టుకోలేకపోయింది. దీంతో.. చైనా స్కోరును సమం చేసింది. ప్రపంచకప్‌ను విజయంతో ప్రారంభించాలనుకున్న భారత జట్టు చివరకు 2-2 డ్రాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
మ్యాచ్ తొలి అర్ధభాగంలో భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ప్రపంచకప్‌లో ఎనిమిది మంది ఆటగాళ్లు తొలిసారి బరిలోకి దిగినా.. యువ భారత జట్టు ఏమాత్రం భయపడకుండా చైనాపై దాడులు చేసింది. ఇరువైపులా వేగవంతమైన కదలికలతో ప్రత్యర్థి రక్షణ శ్రేణిని ఇబ్బందులకు గురిచేసింది.
ఆధిక్యంలోకి వెళ్లినా..
భారత్‌కు ఏడో నిమిషంలోనే గోల్ లభించింది. నేహా అందించిన పాస్‌ను నవనీత్ కౌర్ అద్భుతంగా గోల్‌గా మలచడంతో భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే తొలి క్వార్టర్ ముగిసే సమయంలో భారత సర్కిల్లో ఫౌల్ జరగడంతో చైనాకు పెనాల్టీ స్ట్రోక్ లభించింది. జాంగ్ యింగ్ దాన్ని గోల్‌గా మలచడంతో స్కోరు 1-1గా మారింది.
అయినా భారత్ వెనక్కి తగ్గలేదు. చైనా కోర్ట్ లోకి పదేపదే దూసుకెళ్లింది. 24వ నిమిషంలో దీపిక అద్భుతంగా సర్కిల్‌లోకి ప్రవేశించి పెనాల్టీ కార్నర్ అవకాశాన్ని తెచ్చిపెట్టింది. ఆ అవకాశాన్ని దీపిక గోల్‌గా మలచడంతో భారత్ 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి భారత్ చేతిలో ఆధిక్యం ఉంది. ఆ సమయంలో చూస్తే భారత్ బోణీ విజయం సాధించడం ఖాయంగానే కనిపించింది.
కానీ రెండో అర్ధభాగంలో భారత ఆట పూర్తిగా గాడి తప్పింది. తొలి రెండు క్వార్టర్లలో చైనా డిఫెన్స్ పై ఒత్తిడి పెంచిన భారత్.. ఆ తర్వాత ప్రత్యర్థి దాడులను ఎదుర్కోవడానికే పరిమితమైంది. మైదానం అంచుల (flanks) గుండా బంతిని ముందుకు తీసుకెళ్లడానికి భారత్ చేసిన ప్రయత్నాలను చైనా సమర్థవంతంగా అడ్డుకుంది. చైనా వరుస దాడులతో భారత డిఫెన్స్ పై ఒత్తిడి పెంచింది. గోల్‌కీపర్ సవితా పునియా కీలక సేవ్‌లతో జట్టును పలుమార్లు కాపాడింది. బాల్జీత్ కౌర్ కూడా ఒక గోల్ అవకాశాన్ని అడ్డుకుంది. అయినప్పటికీ చైనా ఒత్తిడి తగ్గలేదు. చివరకు చైనా ప్లేయర్ మా నింగ్ డ్రాగ్‌ఫ్లిక్‌తో గోల్ చేయడంతో స్కోరు 2-2గా మారింది. భారత్ చేతిలో ఉన్న ఆధిక్యం కరిగిపోయింది.
చివరి రెండు క్వార్టర్లలో భారత్ పూర్తిగా రక్షణాత్మక స్థితికి పరిమితమైంది. ఈ దశలో చైనా 13 సార్లు భారత సర్కిల్‌లోకి ప్రవేశించగా, భారత్ ప్రత్యర్థి సర్కిల్‌లోకి కేవలం మూడు సార్లు మాత్రమే ప్రవేశించగలిగింది. చైనాకు నాలుగు పెనాల్టీ కార్నర్ అవకాశాలు లభించగా, భారత్‌కు ఒక్కటి కూడా దక్కలేదు. చివరి నిమిషాల్లో చైనా మరో గోల్ కోసం తీవ్రంగా ప్రయత్నించింది. సవితా పునియా అద్భుత సేవ్‌లతో భారత్‌ను కాపాడటంతో చివరకు ఓటమి తప్పింది. కానీ ఇప్పటికే చేతిలో ఉన్న గెలుపు మాత్రం చేజారిపోయింది.
చైనాతో మ్యాచ్‌ను డ్రా చేసుకుని.. ఒక పాయింట్ సాధించడం పూర్తిగా చెడు ఫలితం కానప్పటికీ, మ్యాచ్ పరిస్థితులను బట్టి చూస్తే భారత్‌కు ఇది నిరాశాజనకమైన ఫలితమే. ఒకవేళ తమ ఆధిక్యాన్ని కాపాడుకోగలిగి ఉంటే, భారత జట్టు ప్రపంచ కప్ ప్రస్థానాన్ని విజయంతో ప్రారంభించి ఉండేది.
ఇక, రాబోయే మ్యాచ్‌లలో మరింత క్రమశిక్షణతో ఆడాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా, ఆధిక్యంలో ఉన్నప్పుడు ప్రత్యర్థికి ఎటువంటి అవకాశాలూ ఇవ్వకుండా విజయాన్ని ఖాయం చేసుకోవడంపై జట్టు దృష్టి సారిస్తోంది. చైనాతో జరిగిన మ్యాచ్‌లో విజయం అంచుల వరకు వచ్చినప్పటికీ, చివరికి డ్రాతో సరిపెట్టుకోవాల్సి రావడంతో అభిమానులు నిరాశ చెందారు.
