బహుజన బంధువు లచ్చన్న ఆశయ సాధనే ధ్యేయం

  • జిల్లాలో ఘనంగా గౌతు లచ్చన్న 117వ జయంతి ఉత్సవాలు

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : వెనుకబడిన తరగతుల సంక్షేమం, హక్కుల సాధన కోసం జీవితాంతం పోరాడిన బహుజన నాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు గౌతు లచ్చన్న ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు.

నగరంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన సర్దార్ గౌతు లచ్చన్న 117వ జయంతి వేడుకలకు కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్, శాసనసభ్యులు గోండు శంకర్, బగ్గు రమణమూర్తి, లచ్చన్న కుమారుడు గౌతు శ్యాంసుందర్ శివాజీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. లచ్చన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉమ్మడి మద్రాసు రాష్ట్ర కాలంలో శ్రీకాకుళం నుంచి మద్రాసు వరకు పాదయాత్ర చేపట్టి బీసీల హక్కుల కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి లచ్చన్న అని కొనియాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన పేదలందరికీ సమర్థవంతంగా చేరవేయడమే ఆయనకు ఇచ్చే నిజమైన గౌరవమని తెలిపారు.

దేశంలో ‘సర్దార్’ అనే బిరుదుకు పూర్తి న్యాయం చేసిన మహానాయకులు సర్దార్ వల్లభభాయ్ పటేల్, సర్దార్ గౌతు లచ్చన్న మాత్రమేనని స్థానిక ఎమ్మెల్యే గోండు శంకర్ అభివర్ణించారు. ఆచార్య ఎన్జీ రంగా వంటి మహనీయులతో లచ్చన్నకు ఉన్న సాన్నిహిత్యం, గురువుల పట్ల ఆయన చూపిన భక్తి భావితరాలకు ఆదర్శమని స్మరించుకున్నారు.

నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ తాను లచ్చన్న శిష్యుడినని, ఆయన వద్ద నుంచే రాజకీయ క్రమశిక్షణను నేర్చుకున్నానని తెలిపారు. లచ్చన్న చూపిన బాటలోనే పయనిస్తూ సామాజిక సమానత్వం కోసం శ్రమిస్తామని ఆయన కుమారుడు, మాజీ మంత్రి గౌతు శ్యాంసుందర్ శివాజీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు.

అంతకుముందు డే నైట్ కూడలిలోని లచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ ఆడిటోరియంలో లచ్చన్న రచనలు, జీవిత చరిత్రను తెలిపే ఫొటో ప్రదర్శనను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ హరిఓం పాండియా, ఆర్డీవో సాయి ప్రత్యూష, గ్రంథాలయ సంస్థ చైర్మన్ పీరుకట్ల విఠల్, ఎడ్యుకేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పి.ఎం.జె. బాబు, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అనురాధ, పలువురు నాయకులు, శ్రీశయన సంఘ పెద్దలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.