ఇంటింటికీ సీఎంఆర్ఎఫ్..
లబ్ధిదారులకు ఎమ్మెల్యే భరోసా
నియోజకవర్గంలో 12 గ్రామాల్లో పర్యటించిన కొలికపూడి శ్రీనివాసరావు
22 మంది లబ్ధిదారులకు రూ.8.07 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
అనారోగ్య బాధితుల ఇళ్లకే వెళ్లి పరామర్శించిన ఎమ్మెల్యే కొలికపూడి
సమస్య ఏదైనా.. నన్ను, నా కార్యాలయాన్ని సంప్రదించండి: కొలికపూడి శ్రీనివాసరావు
తిరువూరుకు పెద్ద ఎత్తున సీఎంఆర్ఎఫ్ నిధులు మంజూరు చేస్తున్న సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు
తిరువూరు, ఆంధ్రప్రభ : అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలకు అండగా నిలుస్తూ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సాయాన్ని లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి అందజేసే కార్యక్రమాన్ని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు చేపట్టారు. తిరువూరు మండల పరిధిలోని 12 గ్రామాల్లో పర్యటించిన ఆయన 22 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.8,07,542 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల ఇళ్లకు నేరుగా వెళ్లిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సీఎంఆర్ఎఫ్ సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్య ఎదురైనా తనను లేదా తన కార్యాలయాన్ని వెంటనే సంప్రదించాలని లబ్ధిదారులకు భరోసా ఇచ్చారు.
ఇంటికే చెక్కులు..
తమ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సీఎంఆర్ఎఫ్ కోసం ఎమ్మెల్యే కార్యాలయాన్ని సంప్రదించగానే ఫైళ్లను సకాలంలో పరిశీలించి, అవసరమైన ప్రక్రియను పూర్తి చేయించి, మంజూరైన చెక్కులను స్వయంగా తమ ఇంటి వద్దకే తీసుకొచ్చి అందజేసిన ఎమ్మెల్యే కొలికపూడి కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. కష్టకాలంలో ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందడంతో ఎంతో ఊరట కలిగిందని పేర్కొన్నారు.
సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు..
తిరువూరు నియోజకవర్గానికి పెద్ద మొత్తంలో సీఎంఆర్ఎఫ్ నిధులు మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాల్లో అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న వారికి సీఎంఆర్ఎఫ్ ఆర్థిక సాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తానని తెలిపారు.
మౌలిక వసతులపై ప్రజల వినతులు..
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ అనంతరం గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కు ప్రజలు స్థానికంగా నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను వివరించారు. రహదారులు, డ్రైనేజీ, ఇతర ప్రజా అవసరాలకు సంబంధించిన సమస్యలను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలకు అవసరమైన సమయంలో అందుబాటులో ఉండి, వారి సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు.
