పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల రికవరీ..
- పోగొట్టుకున్న ఫోన్లను గుర్తించి యజమానులకు అప్పగించిన చిత్తూరు పోలీసులు
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో: పోగొట్టుకున్న, చోరీకి గురైన మొబైల్ ఫోన్లను సీఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) సాంకేతిక పరిజ్ఞానం ద్వారా గుర్తించి చిత్తూరు జిల్లా పోలీసులు రికవరీ చేస్తున్నారు. సీఈఐఆర్ కార్యక్రమం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు రూ.9,55,40,000 విలువైన 4,607 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి వాటి అసలైన యజమానులకు అప్పగించినట్లు జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ను తిరిగి పొందడం బాధితులకు ఆర్థికంగా, వ్యక్తిగతంగా ఎంతో ఉపశమనం కలిగిస్తుందని ఎస్పీ పేర్కొన్నారు.
ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ పోగొట్టుకున్న ఫోన్లను గుర్తించి బాధితులకు తిరిగి అందించడంపై జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని తెలిపారు. మొబైల్ ఫోన్‌లోని ఐఎంఈఐ నంబర్ ఆధారంగా సీఈఐఆర్ వ్యవస్థలో ఫోన్‌ను బ్లాక్ చేయడంతోపాటు దాని వినియోగాన్ని గుర్తించే అవకాశం ఉంటుందని ఎస్పీ వివరించారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వారు సమీప పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా సీఈఐఆర్ వెబ్‌సైట్‌లో వివరాలను నమోదు చేసుకోవచ్చన్నారు.
వివరాలు నమోదు చేసిన వెంటనే సంబంధిత సమాచారం పోలీసులకు చేరుతుందని, ఐఎంఈఐ నంబర్ ఆధారంగా ఫోన్‌ను బ్లాక్ చేసి దాని వినియోగాన్ని నిలిపివేస్తామని తెలిపారు. బ్లాక్ చేసిన మొబైల్ ఫోన్‌ను పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో గుర్తించి రికవరీ చేసిన అనంతరం, దాని అసలైన యజమానిని నిర్ధారించుకుని ఫోన్‌ను అన్‌బ్లాక్ చేసి అప్పగిస్తారని చెప్పారు.
ప్రతి ఒక్కరూ తమ మొబైల్ ఫోన్ ఐఎంఈఐ నంబర్‌ను భద్రపరచుకోవాలని, ఫోన్ పోగొట్టుకున్న వెంటనే సీఈఐఆర్‌లో వివరాలను నమోదు చేయాలని ఎస్పీ సూచించారు. ప్రజల ఆస్తుల రక్షణ, బాధితులకు సత్వర సేవలు అందించడంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత సమర్థవంతంగా వినియోగిస్తామని ఎస్పీ తెలిపారు. 4,607 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి యజమానులకు అందించడంలో కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
