ఆపదలో ఉన్నవారికి చేయూత..
- 40 సార్లు రక్తదానం చేసిన సర్పంచ్
ఖానాపూర్ టౌన్, ఆంధ్రప్రభ : ఆపదలో ఉన్నవారికి చేయూతనిస్తూ పలువురి మన్ననలు పొందుతున్నట్లు నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సత్తనపల్లి గ్రామ సర్పంచ్ సీర్ల విజయ్ ఆనంద్ పేర్కొన్నారు. మండలంలోని పాత ఎల్లాపూర్ గ్రామానికి చెందిన దుంపటి రాజేశ్వర్ తల్లి లక్ష్మి ఆసుపత్రిలో అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నట్లు సామాజిక మాధ్యమాల ద్వారా సమాచారం అందడంతో సర్పంచ్ స్పందించారు. ఆమె చికిత్సకు అవసరమైన బి పాజిటివ్ రక్తాన్ని జిల్లా కేంద్రంలోని లైఫ్ కేర్ బ్లడ్ బ్యాంక్‌కు వెళ్లి ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ సీర్ల విజయ్ ఆనంద్ మాట్లాడుతూ ఇప్పటివరకు 40 సార్లు ఆపదలో ఉన్నవారికి రక్తదానంతోపాటు ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. ఆపద సమయంలో తనను సంప్రదిస్తే వైద్యుల సూచన మేరకు రక్తదానం చేసేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని ఆయన పేర్కొన్నారు.
