Rishabh Pant | టెస్టుల్లో పంత్ దూకుడు..
ఆంధ్రప్రభ : టెస్టు క్రికెట్‌లో రిషభ్ పంత్ తనదైన దూకుడును మరోసారి చూపించాడు. శ్రీలంకతో గాలేలో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు పంత్ 62 బంతులు ఎదుర్కొని 39 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. వర్షం కారణంగా ఆట ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ.. దేవదత్ పడిక్కల్‌తో కలిసి పంత్ భారత ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. శ్రీలంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య బౌలింగ్‌లో పంత్ కొట్టిన భారీ సిక్స్ ఆకట్టుకుంది.
టెస్టు క్రికెట్‌లో సాధారణంగా బ్యాటర్లు ఎక్కువసేపు క్రీజులో నిలబడేందుకు ప్రాధాన్యం ఇస్తారు. భారీ షాట్ల విషయంలో కొంత జాగ్రత్తగా ఉంటారు. కానీ పంత్ శైలి అందుకు భిన్నం. అవకాశం దొరికితే బంతిని బౌండరీ దాటించేందుకు ఏమాత్రం వెనుకాడడు. అందుకే టెస్టు క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్ల జాబితాలో పంత్ ఒక ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుని, భారత్ తరపున అగ్రస్థానంలో నిలిచాడు.
గతేదాడి 2025 విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల అత్యధిక సిక్సర్ల రికార్డు బ్రేక్ చేసిన పంత్ అదే ఏడాది నవంబర్‌లోనే పంత్.. సెహ్వాగ్ పేరిట ఉన్న 90 సిక్సర్ల రికార్డును అధిగమించి ఈ ఘనత సాధించాడు. ఆ తర్వాత కూడా తన సిక్సర్ల సంఖ్యను పెంచుకుంటూ వెళ్లాడు. ప్రస్తుతం 98 సిక్సర్లతో పంత్ అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లోనూ ఉమ్మడి నాలుగో స్థానంలో ఉన్నాడు. క్రిస్ గేల్, టిమ్ సౌథీ కూడా 98 సిక్సర్లతో పంత్‌తో సమానంగా ఉన్నారు.
ఇప్పటివరకు 51 టెస్టులు ఆడిన పంత్.. 88 ఇన్నింగ్స్‌ల్లో 98 సిక్సర్లు బాదాడు. పంత్ టెస్టు గణాంకాలను చూస్తే.. 51 టెస్టులు, 88 ఇన్నింగ్స్‌లు, 3,596 పరుగులు అతని ఖాతాలో ఉన్నాయి. టెస్టుల్లో అతని అత్యధిక స్కోరు 159 పరుగులు కాగా. బ్యాటింగ్ సగటు 43.32 తో… పంత్ స్ట్రైక్‌రేట్ 73.91గా ఉంది. ఇక పంత్ ఖాతాలో 8 సెంచరీలు, 19 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఇప్పటివరకు 382 ఫోర్లు, 98 సిక్సర్లు కొట్టాడు. ఈ గణాంకాలన్నీ కలిపి చూస్తే.. పంత్ టెస్టు క్రికెట్‌లో కేవలం నిలబడే బ్యాటర్ కాదని, పరుగులు వేగంగా సాధించేందుకు ప్రయత్నించే ఆటగాడని అర్థమవుతుంది.
అయితే పంత్ ప్రత్యేకత కేవలం సిక్సర్లలోనే కాదు. మ్యాచ్ పరిస్థితిని ఒక్కసారిగా మార్చగల సామర్థ్యం అతని సొంతం. ప్రత్యర్థి బౌలర్లు ఆధిపత్యం చెలాయిస్తున్న సమయంలో వరుసగా బౌండరీలు కొట్టి ఒత్తిడిని వారి మీదకు మళ్లించగలడు. పంత్ దూకుడైన బ్యాటింగ్ శైలిపై కొన్నిసార్లు విమర్శలు వచ్చినా.. అదే దూకుడు అతడిని మిగతా వికెట్ కీపర్ బ్యాటర్లకు భిన్నంగా నిలబెట్టింది. టెస్టు మ్యాచ్‌లో ప్రశాంతంగా సాగుతున్న ఆటను ఒక్క భారీ షాట్‌తో మార్చగల సామర్థ్యం అతనికి ఉంది.
గాలే టెస్టులోనూ పంత్ తనదైన శైలిలోనే ఆడాడు. తొలి రోజు దేవదత్ పడిక్కల్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో భారత్‌కు బలమైన పునాది వేశాడు. వర్షం కారణంగా ఆటకు పలుమార్లు అంతరాయం ఏర్పడినా.. భారత బ్యాటర్లు శ్రీలంక బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. పడిక్కల్ 131 పరుగులతో, పంత్ 27 పరుగులతో క్రీజులో ఉన్నారు.
రెండో రోజు పడిక్కల్ 167 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఆ తర్వాత పంత్, కేఎల్ రాహుల్ కూడా కొద్దిసేపటికే పెవిలియన్ చేరారు. పంత్ 62 బంతుల్లో 39 పరుగులు చేసినప్పటికీ.. అతని ఇన్నింగ్స్‌లో ఒక సిక్స్ ఉంది. అదే సిక్స్‌తో అతని టెస్టు కెరీర్ సిక్సర్ల సంఖ్య మరింత పెరిగింది. పంత్ ఇదే దూకుడును కొనసాగిస్తే.. త్వరలోనే 100 టెస్టు సిక్సర్ల మైలురాయిని కూడా అందుకునే అవకాశం ఉంది. అదే జరిగితే టెస్టు క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన అతి కొద్ది మంది ఆటగాళ్లలో పంత్ కూడా ఒకడిగా నిలుస్తాడు.
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ బెన్ స్టోక్స్ 138 సిక్సర్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ 107 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్ కీపర్ బ్యాటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ 100 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. పంత్ 98 సిక్సర్లు కొట్టిన పంత్.. క్రిస్ గేల్, టిమ్ సౌథీ లతో కలిసి నాలుగో స్థానంలో ఉన్నాడు.
