డ్రైనేజీ పైపు లీకేజీతో దుర్వాసన..

పాయకాపురం, ఆంధ్రప్రభ : నున్న–నూజివీడు రహదారిలో పాయకాపురం రైతు బజార్‌ వద్ద ప్రధాన రహదారి వెంబడి సైడ్‌ కాల్వను ఆనుకుని ఉన్న డ్రైనేజీ పైపులైన్‌ లీకైంది. దీంతో మురుగునీరు బయటకు వచ్చి దుర్వాసన వెదజల్లుతోందని స్థానికులు వాపోతున్నారు.

రైతు బజార్‌కు నిత్యం పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. కూరగాయలు, పండ్లు విక్రయించే బండ్ల వద్దకు వినియోగదారులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో డ్రైనేజీ పైపులైన్‌ లీకేజీ కారణంగా దుర్వాసన వ్యాపిస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

ప్రధాన రహదారి వెంబడి డ్రైనేజీ పైపులైన్‌ లీకవుతున్నప్పటికీ సంబంధిత సిబ్బంది పట్టించుకోకపోవడంపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా వీఎంసీ ఉన్నతాధికారులు స్పందించి లీకేజీని వెంటనే అరికట్టి, ప్రజల ఇబ్బందులను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.