ఉచిత దంత వైద్య శిబిరం..
నిజామాబాద్ సాంస్కృతికం, ఆంధ్రప్రభ : ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో నగరంలోని కోటగల్లీలో గల బీసీ హాస్టల్‌లో ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి ముఖ్యఅతిథిగా 48వ డివిజన్ కార్పొరేటర్ ప్రసన్న హాజరయ్యారు. ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో ఇలాంటి ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమని ఆమె అన్నారు.
భవిష్యత్తులో తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. శిబిరానికి డాక్టర్ ముక్క కవిత హాజరై విద్యార్థుల దంతాలను పరీక్షించారు. అనంతరం వారికి దంత సంరక్షణ పరికరాల సమితి, మందులను అందజేశారు. దంతాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. దంత సమస్యలు, వాటి నివారణ చర్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఇన్నర్ వీల్ క్లబ్ సేవా దృక్పథంతో సమాజానికి చేయూతనివ్వడమే తమ కర్తవ్యమని ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ అధ్యక్షురాలు బచ్చు సులక్షణ అన్నారు. ఈ కార్యక్రమంలో 50 మంది విద్యార్థులకు ఉచిత దంత వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.
ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో విద్య, వైద్యం, మహిళా సాధికారతకు సంబంధించిన పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇన్నర్ వీల్ క్లబ్ కార్యదర్శి ముక్క ప్రసన్న, మూడ శిరీష, వైశాలి సుబేదార్, రమ ఆకుల, స్వప్న, కవిత అగర్వాల్, పద్మ కోటగిరి తదితర సభ్యులు పాల్గొన్నారు.
