ఆంధ్రప్రభ కథనంపై ఉన్నతాధికారుల ఆరా..
వాజేడు, ఆంధ్రప్రభ : ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు బీట్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా ఫారెస్ట్ ప్లాంటేషన్ నిర్వహిస్తున్నారంటూ ఆంధ్రప్రభలో ప్రచురితమైన కథనంపై అటవీ శాఖ ఉన్నతాధికారులు స్పందించినట్లు సమాచారం.
కథనంపై ఆరా తీసిన ములుగు జిల్లా అటవీ శాఖ ఉన్నతాధికారులు.. అటవీ అధికారులు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కిందిస్థాయి ఉద్యోగులను హెచ్చరించినట్లు తెలిసింది.

ప్రభుత్వ ఆదేశాల మేరకు అటవీ నిబంధనల ప్రకారం ప్లాంటేషన్ నిర్వహణ కొనసాగాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఉన్నతాధికారులు స్పష్టం చేసినట్లు సమాచారం.
ఈ వ్యవహారంపై సమగ్ర విచారణను జిల్లా అటవీ అధికారి చేపట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే తప్పులను కప్పిపుచ్చుకునేందుకు స్థానిక అధికారులు మొక్కలు బతికి ఉన్న ప్రాంతాల్లో ఫొటోలు తీసి ఉన్నతాధికారులకు సమాచారం అందించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
స్థానిక అధికారులు తమ తప్పుల నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపడితే పేరూరు బీట్ పరిధిలో అసలు ఏం జరిగిందనే విషయం వెలుగులోకి వస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
