జగన్మాతను దర్శించుకున్న డీజీపీ..
- పోలీస్ బాస్ కి ఇంద్రకీలాద్రిపై అపూర్వ స్వాగతం..
- ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన దుర్గగుడి చైర్మన్ ఈవో
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సందర్శించి కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. రాష్ట్ర పోలీస్ శాఖకు సర్వోన్నత అధికారిగా ఆలయానికి విచ్చేసిన డీజీపీకి దేవస్థానం ట్రస్ట్‌బోర్డు చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ ) , ఈఓ వి.కె. సీనా నాయక్ ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అమ్మవారి ఆశీర్వాద మండపంలో వేద పండితులు డీజీపీకి వేదాశీర్వచనం అందించారు. అనంతరం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈఓ సీనా నాయక్ కలిసి అమ్మవారి శేషవస్త్రం, లడ్డూ ప్రసాదం, అమ్మవారి చిత్రపటాన్ని జ్ఞాపికగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, భక్తుల సౌకర్యార్థం చేపట్టిన క్యూలైన్ నిర్వహణను డీజీపీ పరిశీలించి అభినందించారు. సాధారణ భక్తులకు సైతం సులభంగా, ప్రశాంతంగా అమ్మవారి దర్శనం కల్పించేలా చైర్మన్, ఈఓ తీసుకుంటున్న చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో దేవస్థాన అర్చకులు, పాలకమండలి సభ్యులు, పోలీస్ శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
