ఊర కుక్కల బెడద.. ప్రజలు భయాందోళన
రాయపర్తి, ఆంధ్రప్రభ: రాయపర్తి మండల కేంద్రంలో ఊర కుక్కల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదివారం ఉదయం బృహత్ పల్లె ప్రకృతి వనానికి వెళ్లే ప్రధాన రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న ఐదుగురిపై కుక్కలు అకస్మాత్తుగా దాడి చేయడంతో వారు గాయపడ్డారు. స్థానికులు కుక్కలను తరిమికొట్టి, క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.
గ్రామంలో కొంతకాలంగా కుక్కల సంఖ్య పెరిగిపోవడంతో వీధులు, పాఠశాలలు, ప్రధాన రహదారులపై గుంపులుగా సంచరిస్తున్నాయని ప్రజలు తెలిపారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, విద్యార్థులు బయటకు రావాలంటే భయపడుతున్నారని పేర్కొన్నారు.
పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు. ప్రజల భద్రతకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు.
