స్వాతంత్ర్య దినోత్సవ వేళ పెను విషాదం..
- కృష్ణానదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
విజయవాడ, ఆంధ్రప్రభ: స్వాతంత్ర్య దినోత్సవ వేళ విజయవాడలో విషాదం చోటుచేసుకుంది. సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులు కృష్ణానదిలో గల్లంతై మృత్యువాతపడ్డారు. కృష్ణలంకకు ఎదురుగా ఐదో నంబర్ పిల్లర్ సమీపంలో ఈ ఘటన జరిగింది.
కృష్ణలంకకు చెందిన ముగ్గురు యువకులు శనివారం కృష్ణానదిలో ఈతకు దిగారు. కొద్దిసేపటికే ప్రమాదవశాత్తు నీటిలో గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది అప్రమత్తమై గజ ఈతగాళ్లను రంగంలోకి దించారు. నదిలో విస్తృతంగా గాలింపు చేపట్టగా.. ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు.
మృతులను వీసం గౌతమ్ (18), గడ్డం జాషువా (17), తేజ (18)గా గుర్తించారు. పండుగ రోజున ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోవడంతో కృష్ణలంకలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
