హాకీ ప్రపంచకప్‌లో భారత్‌ శుభారంభం..

  • ఆరంభం అదుర్స్..
  • వేల్స్‌పై ఘన విజయం
  • హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ డబుల్‌ గోల్స్‌..

ఆంధ్రప్రభ: హాకీ ప్రపంచకప్‌ 2026లో టీమిండియా శుభారంభం చేసింది. వేల్స్ జ‌ట్టుపై 3-1 తేడాతో ఘనవిజయం సాధించింది. ఆమ్‌స్టెల్‌వీన్‌లోని వాగెనర్ స్టేడియంలో జ‌రిగిన మ్యాచ్ లో డిఫెన్స్‌లో స్ట్రాంగ్‌గా నిలబడిన భారత్.. మ్యాచ్‌పై పూర్తి కంట్రోల్ సాధించింది.

కాగా, భారత్ సాధించిన మూడు గోల్స్ కూడా పెనాల్టీ కార్నర్ల ద్వారానే వచ్చాయి. ఇందులో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు గోల్స్ చేశారు. అయితే, సరికొత్త లుక్ తో ప్రపంచ కప్‌లో అడుగుపెట్టిన భారత్, స్కోరు బోర్డుపై తన డామినేష‌న్ ను చూపించింది. భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ జరిగిన ఈ మ్యాచ్‌కు పెద్ద సంఖ్యలో భారతీయ అభిమానులు హాజరయ్యారు.

ఈ భారత జట్టులో సీనియర్ ఆటగాళ్లతో పాటు ప్రపంచ కప్‌లో అరంగేట్రం చేస్తున్నవారు కూడా ఉన్నారు. రాజిందర్ సింగ్, దిల్ప్రీత్ సింగ్, శిలానంద్ లక్రా, ఆదిత్య లాలాగే మైదానంలో ఆకట్టుకున్నారు. అయితే, ప్రపంచ కప్‌లో అరంగేట్రం చేస్తున్న గోల్‌కీపర్ సూరజ్ కర్కెరా మ్యాచ్ ప్రారంభమైన మూడవ నిమిషంలోనే తన ప్రభావం చూపాడు.

వెల్ష్ ఆటగాళ్లు భారత జట్టు ‘సర్కిల్’లోకి ప్రవేశించి, జాక్ ప్రిచర్డ్ కోసం గోల్ చేసే మంచి అవకాశాన్ని సృష్టించారు. అయితే, సూరజ్ కర్కెరా వెంటనే గోల్‌పోస్ట్ నుండి వేగంగా ముందుకు వచ్చి ఆ దాడిని అడ్డుకున్నాడు. అలాగే, ప్రిచర్డ్ కొట్టిన షాట్‌ను సూరజ్ అద్భుతంగా అడ్డుకున్నాడు.

ఆ తర్వాత, గోల్‌కీపర్ మోహిత్ కొంత ఒత్తిడికి గురయ్యాడు. ప్రిచర్డ్ అతన్ని డ్రిబ్లింగ్ ద్వారా దాటి ఖాళీ గోల్ ముందు నిలిచాడు, కానీ బంతి గోల్‌పోస్ట్‌కు తగలడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది.

ఇండియా డామినేషన్.. ఫస్ట్ పెనాల్టీ కార్నర్

ఆ తర్వాత, భారత్ క్రమంగా మ్యాచ్‌పై పట్టు సాధించింది. మిడ్‌ఫీల్డర్లు హార్దిక్ సింగ్, నీలకాంత శర్మ, మన్‌ప్రీత్ సింగ్ తెలివిగా ఖాళీ స్థలాన్ని సృష్టించి, వేల్స్ జట్టును వారి సొంత హాఫ్‌కే పరిమితం చేశారు. హార్దిక్ సింగ్ వేగంగా ముందుకు వెళ్లి మందీప్ సింగ్‌కు పాస్ ఇవ్వడంతో ఇండియాకు తొలి పెనాల్టీ కార్నర్ వచ్చింది.

ఆ సమయంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ గ్రౌండ్‌లో లేకపోయినా.. ఇండియా ఆ ఛాన్స్‌ను మిస్ చేయలేదు. డిఫెండర్ సంజయ్ రాణా డ్రాగ్‌ఫ్లిక్‌తో వచ్చిన రెండో అవకాశాన్ని విజయవంతంగా గోల్‌గా మలిచాడు.

8వ నిమిషంలో సంజయ్ కొట్టిన డ్రాగ్‌ఫ్లిక్ గోల్‌కీపర్ టోబీ రేనాల్డ్స్-కాటెరిల్ కుడివైపు నుంచి దూసుకెళ్లింది. బంతి ముందు సుఖ్‌జీత్ సింగ్ జంప్ చేయడంతో గోల్‌కీపర్ ఫోకస్ కొంత డిస్ట్రబ్ అయింది. బంతి అతడి కాళ్ల మధ్య నుంచి వెళ్లి బోర్డును తాకడంతో ఇండియా 1-0 లీడ్‌లోకి వెళ్లింది.

హర్మన్‌ప్రీత్ పవర్‌ఫుల్ డ్రాగ్‌ఫ్లిక్.. 2-0 లీడ్

ఫస్ట్ క్వార్టర్‌లోనే ఇండియన్ ఫ్యాన్స్‌కు మరో గొప్ప ఘట్టాన్ని వీక్షించారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ తన పవర్‌ఫుల్ డ్రాగ్‌ఫ్లిక్‌తో బంతిని గోల్ కుడివైపు కార్నర్‌లోకి పంపించాడు. దీంతో ఇండియా లీడ్ 2-0కు పెరిగింది. ఇండిపెండెన్స్ డే రోజున టీమిండియా ఆట మరింత డామినెంట్‌గా కనిపించింది.

వేల్స్‌కు స్పేస్ ఇవ్వని ఇండియా డిఫెన్స్

రెండవ క్వార్టర్‌లో, భారత్ తమ ఆధిక్యాన్ని కాపాడుకోవడంపై దృష్టి సారించింది. భారత డిఫెండ‌ర్లు దృఢంగా నిలబడ్డారు. వేల్స్ ఆటగాళ్లు ఎదురుదాడికి ప్రయత్నించినప్పుడల్లా, భారత క్రీడాకారులు వెంటనే వారిపై ఒత్తిడి తెచ్చారు. ఫార్వర్డ్ ప్లేయర్లకు కీలక పాసులు వెళ్లకుండా ఇండియా డిఫెన్స్ అడ్డుకుంది. దీంతో వేల్స్ అటాకింగ్ మూవ్స్ చాలావరకు ఫెయిల్ అయ్యాయి. మరోవైపు ఇండియా ఫార్వర్డ్ లైన్‌లో మందీప్ సింగ్, అభిషేక్ నైన్, సుఖ్‌జీత్ సింగ్ మంచి కోఆర్డినేషన్‌తో ఆడారు. వీరి కాంబినేషన్ బాగున్నా.. గోల్ ముందు మాత్రం కొంత ఫినిషింగ్ లక్ కలిసి రాలేదు.

మూడో గోల్.. మరోసారి హర్మన్‌ప్రీత్ షో

మూడో క్వార్టర్‌లో ఇండియాకు మరో పెనాల్టీ కార్నర్ వచ్చింది. తన నాలుగో వరల్డ్‌కప్ ఆడుతున్న మన్‌దీప్ సింగ్.. వేల్స్ ప్లేయర్ పాస్‌ను మధ్యలోనే ఇంటర్‌సెప్ట్ చేశాడు. ఆ తర్వాత అభిషేక్ నైన్ బంతిని సుఖ్‌జీత్ సింగ్‌కు అందించాడు. సుఖ్‌జీత్ సర్కిల్‌లో బంతిని అందుకోవడంతో ఇండియాకు మ్యాచ్‌లో ఏడో పెనాల్టీ కార్నర్ లభించింది. ఈ ఛాన్స్‌ను కూడా హర్మన్‌ప్రీత్ వదల్లేదు. మరోసారి తన డ్రాగ్‌ఫ్లిక్‌తో బంతిని నేరుగా బోర్డులోకి పంపించాడు. రేనాల్డ్స్-కాటెరిల్‌కు ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండా కొట్టిన ఈ షాట్‌తో ఇండియా 3-0 లీడ్‌లోకి వెళ్లింది.

లాస్ట్‌లో వేల్స్ గోల్.. ఇండియాకు చిన్న షాక్

మ్యాచ్ చివరి నిమిషాల్లో వేల్స్ చేసిన ప్రయత్నానికి చివరకు ఫలితం వచ్చింది. గోల్‌లైన్ దగ్గర జరిగిన స్క్రాంబుల్ తర్వాత సామ్ వెల్ష్ బంతిని మొహిత్‌పై నుంచి లిఫ్ట్ చేసి గోల్‌గా మార్చాడు. దీంతో వేల్స్ ఖాతాలో తొలి గోల్ చేరింది. ఇండియా 3-1 లీడ్‌లో ఉన్నప్పటికీ.. మ్యాచ్‌లో ఇదే ఇండియాకు వచ్చిన ఏకైక మైనస్ పాయింట్.

టోర్నమెంట్ ముందుకు సాగుతున్న కొద్దీ, ప్రత్యర్థులు ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లను తమకు అనుకూలంగా మలుచుకోకుండా చూసుకోవడానికి భారత్ మరింత అప్రమత్తంగా ఉండాలి. ఏది ఏమైనప్పటికీ, సవాళ్లతో కూడిన ఏడాది తర్వాత టోర్నమెంట్‌లో అడుగుపెట్టిన భారత జట్టు, వేల్స్‌పై 3-1 తేడాతో విజయం సాధించి తన పోరాటాన్ని ఘనంగా ప్రారంభించింది.

మూడు పెనాల్టీ కార్నర్ గోల్స్‌లో రెండింటిని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ సాధించడం ఈ విజయంలో ఒక ప్రత్యేక ఆకర్షణ. కొత్త లుక్ తో బరిలోకి దిగిన భారత జట్టు, డిఫెన్స్ లో పటిష్టంగా, అటాక్ లో సమర్థవంతంగా కనిపించి, స్వాతంత్ర్య దినోత్సవం నాడు భారత అభిమానులకు ఒక అద్భుతమైన కానుకను అందించింది.

కాగా, భారత్ తన తదుపరి మ్యాచ్‌ను ఇంగ్లాండ్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ ఆగస్టు 17న భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6:30 గంటలకు నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టల్‌వీన్ వాగెనర్ స్టేడియంలో జరగనుంది.