ఉద్యాన పంటల్లో దేశంలోనే ముందంజలో కళ్యాణదుర్గం
కళ్యాణదుర్గం, ఆంధ్రప్రభ : దేశంలోనే అత్యధికంగా ఉద్యాన పంటలు పండించే ప్రాంతాల్లో కళ్యాణదుర్గం ఒకటని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా బీటీపీ ప్రాజెక్టు ఆలస్యమైందని ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల సౌకర్యార్థం ఎస్సార్సీ సంస్థ ఆధ్వర్యంలో నియోజకవర్గవ్యాప్తంగా రూ.5 కోట్ల వ్యయంతో 7,300 సైకిళ్లను పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
కుందుర్పి మండలం అపిలేపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గ్రామీణ విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అపిలేపల్లి గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు గ్రామస్థులు, టీడీపీ నాయకులు గజమాలతో ఘన స్వాగతం పలికారు.
అనంతరం గ్రామంలోని ప్రముఖ శ్రీ బొబ్బులకుంట ఆంజనేయస్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులకు సైకిళ్లను వారి తల్లిదండ్రుల సమక్షంలో అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ మండల, స్థానిక నాయకులు, ఎంఈఓలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు తోడుగా ఉండి విద్యకు ప్రాధాన్యత కల్పించడంతో పాటు వారికి మరింత ప్రోత్సాహం అందించేందుకు సైకిళ్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. సరైన రవాణా సౌకర్యం లేక గ్రామీణ ప్రాంతాల్లో 9, 10 తరగతులు, ఇంటర్ చదువుతున్న విద్యార్థులు పాఠశాలలకు నడుచుకుంటూ వెళ్తున్నారని, వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కానుకగా సైకిళ్లు అందిస్తున్నామని చెప్పారు.

ఎస్సార్సీ సంస్థ తరఫున రూ.5 కోట్ల వ్యయంతో నియోజకవర్గవ్యాప్తంగా 7,300 సైకిళ్లు పంపిణీ చేస్తున్నామని, ఇంత పెద్ద కార్యక్రమం విజయవంతం కావడం వెనుక ఎస్సార్సీ సంస్థలో పనిచేస్తున్న 7,000 మంది శ్రమ ఉందని తెలిపారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలని, పిల్లలను అనవసరమైన పనులకు కేటాయించకుండా చదువుకునేందుకు ఎక్కువ సమయం కేటాయించాలని సూచించారు. వర్షాలు రాకపోతే ఈ ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోతారని ఎమ్మెల్యే అన్నారు.
ఉమ్మడి జిల్లాలో మిగిలిన 13 నియోజకవర్గాలకు ఏదో ఒక విధంగా కాలువల ద్వారా నీరు అందుతోందని, నీరు రాని నియోజకవర్గం కళ్యాణదుర్గం మాత్రమేనని పేర్కొన్నారు. ఈ ప్రాంతానికి అత్యంత అవసరమైన జీవనాడి బీటీపీ ప్రాజెక్టేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి చెప్పానన్నారు. బీటీపీ పూర్తి చేసి కృష్ణా జలాలు అందిస్తే ఈ ప్రాంతంలోని ప్రతి ఇంట్లో ముఖ్యమంత్రి ఫొటో పెట్టుకుంటారని తాను చెప్పగా, త్వరలో కళ్యాణదుర్గం వచ్చినప్పుడు ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని తెలిపారు.
బీటీపీ ప్రాజెక్టు ఆలస్యం కావడానికి గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఎమ్మెల్యే ఆరోపించారు. ఐదేళ్ల పాలనలో భూములు ఇచ్చిన రైతుల వివరాలను సరిచేయకుండా వదిలేయడం వల్లే ఇప్పుడు ఆ వివరాలను సరిచేయడానికి 16 నెలల సమయం పట్టిందని తెలిపారు. కాలువ పనులను వేగవంతం చేసి నీటిని అందించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి మౌలిక వసతులు కల్పించడంతో పాటు యూనిఫాం, షూస్, బెల్ట్, బ్యాగ్, పుస్తకాలు అందిస్తున్నారని చెప్పారు. నాణ్యమైన సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం అందిస్తూ పాఠశాలలను బలోపేతం చేస్తున్నారని పేర్కొన్నారు.
గత ప్రభుత్వం అందరికీ అమ్మఒడి ఇస్తామని చెప్పి, అమలు చేసే సమయంలో ఒక్క ఇంట్లో ఒక్కరికే ఇచ్చి విద్యార్థుల చదువులను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. అమ్మఒడి పథకం ద్వారా రూ.5,500 కోట్లు మాత్రమే అందించారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో తల్లిదండ్రుల సమస్యలను గుర్తించి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంట్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులు ఎంతమంది ఉంటే అందరికీ తల్లికి వందనం అందిస్తామని హామీ ఇచ్చిందన్నారు. ఆ హామీ మేరకు రూ.10,190 కోట్లు కేటాయించి ప్రతి తల్లి ఖాతాలో జమ చేసి ప్రభుత్వం తన నిబద్ధతను చాటుకుందని తెలిపారు.
చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్న 30 వేల మంది అంగన్వాడీ ఉద్యోగులకు కూడా ప్రయోజనం కల్పించి కూటమి ప్రభుత్వం గొప్ప మనసు చాటుకుందని అన్నారు. గతంలో విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేసి ఉపాధ్యాయులను బ్రాందీ షాపుల వద్ద ఉంచారని ఎమ్మెల్యే విమర్శించారు. ఎన్నికల ముందు గ్రామాల్లో పర్యటించిన సమయంలో అనేక చోట్ల విద్యార్థులు పుస్తకాల బ్యాగులు మోసుకుంటూ నడుచుకుంటూ పాఠశాలలకు రావడం చూసి బాధ కలిగిందని తెలిపారు. అప్పుడే విద్యార్థుల ఇబ్బందులను ఏదో ఒక విధంగా తొలగించాలని నిర్ణయించుకున్నానని, ఇప్పుడు వారికి సైకిళ్లు అందించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ దేశ, విదేశాల్లో పర్యటించి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకువచ్చి అభివృద్ధి చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. ఈ ప్రాంతంలో ఎంతోమంది ఉన్నత చదువులు చదివి ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారని తెలిపారు. తిమ్మసముద్రం ప్రాంతంలో ఇప్పటికే ఉన్న 1,200 ఎకరాలకు అదనంగా మరో 3,000 ఎకరాల భూమిని సేకరించి రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయబోతున్నారని చెప్పారు. దీని ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ఈ ప్రాంతంలోని భూముల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందన్నారు.
