August16Sunday2026 | ఆంధ్రప్రభ ఆదివారం సంచిక

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఆగస్టు 20… ప్రపంచ దోమల దినోత్సవం.
ఈ రోజు మా దోమలందరికీ చాలా ప్రత్యేకమైన రోజు.
కానీ మా గురించి మాట్లాడేటప్పుడు మాత్రం అందరూ ఒకటే మాట అంటారు…
“దోమలు రక్తం పీలుస్తాయి!”
అయ్యో…మేము వచ్చేది చాలా చిన్నగా…
పోయేది కూడా చాలా చిన్నగానే!
మీ రక్తంతో మా అవసరం కూడా అంతే చిన్నది.
కాస్త రక్తం తీసుకుంటాం. అంతే!
అందుకు మమ్మల్ని ఇంత విలన్లను చేసేస్తారా?
ఒక్కసారి మా కోణంలో కూడా ఆలోచించండి బాబూ!
మీరు మా గురించి “రక్తం పీల్చే దోమలు” అంటారు.
కానీ మీ చుట్టూ ఉన్నవాళ్లలో ఎంతమంది మీ రక్తాన్ని కాదు…
మీ జేబును, మీ సమయాన్ని, మీ సహనాన్ని పీల్చేస్తున్నారో ఎప్పుడైనా లెక్కపెట్టారా?
మేమైతే కనీసం చెవిలో ముందే “ఝుం… ఝుం…” అని హెచ్చరిస్తాం.
కానీ…
ఈఎంఐ మాత్రం మెసేజ్ వచ్చే వరకు నిశ్శబ్దంగా ఉంటుంది!
మేము ఒకసారి కుడితే దురద వస్తుంది.
అప్పు మాత్రం నెలల తరబడి దురద పెడుతుంది!
ఇక ట్రాఫిక్ సంగతి చెప్పకండి.
మేము ఒక మనిషి చుట్టూ తిరుగుతూ రక్తం కోసం వెతుకుతాం.
ట్రాఫిక్ మాత్రం ఒక మనిషిని కారులో కూర్చోబెట్టి రెండు గంటలు ఒకే చోట కూర్చోబెడుతుంది.
మేము రక్తం పీలుస్తున్నామని మమ్మల్ని తిడతారు…
ట్రాఫిక్ మీ జీవితంలోని సమయాన్ని పీల్చేస్తుంటే మాత్రం దానిని “ప్రయాణం” అంటారు!
ఇక మొబైల్ ఫోన్…
దాని గురించి మాట్లాడే అర్హత మాకు అసలు లేదు.
మేము ఐదు నిమిషాలు మనిషి చుట్టూ తిరిగితే కొట్టి చంపేస్తారు.
మొబైల్ మాత్రం ఐదు గంటలు మనిషి చేతిలో ఉన్నా…
“చాలా మంచి ఫోన్!” అంటారు.
మేము రక్తం తీసుకుంటాం.
అది మీ సమయం తీసుకుంటుంది.
మరో రకం ఉంది…
ఉచిత సలహా ఇచ్చే దోమలు!
మీరు ఏం చేసినా వాళ్లకు ఒక సలహా ఉంటుంది.
ఏం తినాలి…
ఎలా బతకాలి…
ఎక్కడ డబ్బు పెట్టాలి…
పిల్లలను ఎలా పెంచాలి…
వాళ్లు మీ రక్తం తీసుకోరు.
కానీ…
మీ సహనాన్ని మాత్రం చివరి చుక్క వరకు పీల్చేస్తారు!
మా మీద ఇంకో ఆరోపణ ఉంది.
“దోమలు కనిపించకుండా వచ్చి కుడతాయి” అంటారు.
అది కూడా నిజమే.
కానీ మేమైనా రాత్రిపూట మాత్రమే వస్తాం.
కొన్ని బిల్లులు మాత్రం…
నెలలో ముప్పై రోజులు కనిపిస్తూనే ఉంటాయి!
మా వల్ల వ్యాధులు వస్తాయని మీరు భయపడతారు.
భయపడటం మంచిదే.
మమ్మల్ని నియంత్రించండి. నీరు నిల్వ ఉండకుండా చూసుకోండి.
దోమల వల్ల వచ్చే వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండండి.

అది మా మీద కోపం కాదు…
మీ ఆరోగ్యం మీద శ్రద్ధ.
కానీ ఒక చిన్న విజ్ఞప్తి…
మమ్మల్ని మాత్రమే “రక్తం పీల్చేవాళ్లు” అనకండి!
మీ చుట్టూ…
జేబు పీల్చేవాళ్లు,
సమయం పీల్చేవాళ్లు,
సహనం పీల్చేవాళ్లు,
నిద్ర పీల్చేవాళ్లు,
శక్తి పీల్చేవాళ్లు…
ఇంకా చాలా మంది ఉన్నారు!
మేమైతే…
చిన్న దోమలం. చిన్న కడుపు. చిన్న అవసరం!
మీ ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద “దోమల”తో పోలిస్తే మేం చాలా అమాయకులం బాబూ!
అందుకే ఈ దోమల దినోత్సవం సందర్భంగా మా తరఫున ఒక చిన్న సందేశం…
“దోమను కొట్టే ముందు…
మీ జీవితాన్ని పీల్చేస్తున్న వాటిని కూడా ఒక్కసారి గుర్తు చేసుకోండి!”

-మాధవ్, కార్టూనిస్ట్.

___________________________________________________________

అలవాటు చేయాలి..

మనం సినిమా రంగంలో ఉన్న కొంతమంది కళాకారులను చూసి వీళ్ళు అసలు ఈ ఫీల్డ్ లోకి ఎలా వచ్చారు ? అని నవ్వుకుంటూ ఉంటాం.అంటే అంత అధ్వాన్నంగా ఉంటుంది వాళ్ళ టేలెంట్. అలాగే రీల్స్ లో మనకు కనబడే రక రకాల కళాకారులు కూడా విపరీతంగా పాపులర్ అవుతూ ఉంటారు వాళ్ళ పెర్ఫార్మెన్స్ పిచ్చి గా ఉన్నా కూడా. అసలు వీళ్లు ఎందుకు పాపులర్ అవుతున్నారు ? ఇలా తక్కువ స్థాయి టేలెంట్ ఉన్నవాళ్ళని మనం నిజంగా బయట కనిపిస్తే ఆదరిస్తామా ? అన్న సందేహాలు నాలో కలుగుతూ ఉంటాయి.
ఉదాహరణకు మన సినిమా హీరోల్ని , కమెడియన్స్ ను తీసుకుందాం.వీళ్ళు కొత్తలో మనకు అదోలా కనిపిస్తారు.కానీ వాళ్ళ స్టైల్ క్రమంగా మనకు అలవాటు అయి నచ్చుతుంది.అలాగే కొత్త కొత్త గాయకులు మొదట్లో మనకు నచ్చక పోయినా క్రమేణా వాళ్ళ గొంతు మనకు వినసొంపుగా ఉంటుంది.అలాగే ఒక రచయిత వ్రాసేది మొదట్లో నచ్చకపోవచ్చు కానీ క్రమేణా అతని శైలి మనకి అలవాటు అవుతుంది. ఇదంతా కేవలం వాళ్ళు నిరంతరం కృషి చేసి వాళ్ళ టేలెంట్ ను మనకు అలవాటు చేయడం వల్లనే. అదే అసలు కారణం.
అందుకే మనలోని టేలెంట్ , తెలివి, విద్వత్తు లిమిటెడ్ గా ఉన్న కూడా నిరంతరం కృషి చేసి మన టేలెంట్ ను ప్రజలకు అలవాటు చెయ్యాలి.ఆఫీసులోని , బిజినెస్ లోనూ అయితే మన పై వారిని ఇంప్రెస్ చెయ్యాలి.అదే ముఖ్యం.మీరు కూడా ఈ మాటలతో ఒప్పుకుంటారు కదా ఫ్రెండ్స్ !!!!

_______________________________________________________________________

దోమల రాజ్యం

సాయంకాలం అయ్యింది. పూటకుళ్ళమ్మకు ఇవ్వాల్సిన ఐదు రూపాయలు(120 years back అది చాలా పెద్ద డబ్బు) డాన్సింగ్ గర్ల్ కి ఖర్చు పెట్టేసాను. …పూర్ రిచర్డ్ చెప్పినట్టు లౌక్యం ఉంటేనే గానీ ఈ లోకంలో నెగ్గుకు రాలేము. ఇక ఈ ఊర్లో మన పప్పులు ఉడకవు. త్వరగా బీచానా ఎత్తేయాలి. కానీ మధురవాణిని విడిచి వెళ్ళాలంటే మనసు రావడం లేదు. It is the woman that seduced all mankind. గిరీశం ఇలా అన్నాడు, మహాకవి గురజాడ మాట్లాడారు. కన్యాశుల్కం గొప్ప నాటకం.

మనందరిలో ఒక గిరీశం ఉంటాడు. అవకాశ వాది. అక్కడ అంశం గిరీశం, గురజాడ కాదు, దోమలు. Those are the mosquitoes that have seduced all of mankind, not with love, but with an irresistible thirst for our blood! స్త్రీ వల్ల, ఆ అద్భుత ఆకర్షణ వల్ల, మంచి, చెడు రెండూ జరుగుతాయి. Seduce అనేది కొంచం నెగెటివ్ పదం ఈ context లో. కానీ దోమలు విషయంలో కాదు.

మన దేశంలో అయితే దోమలు, దోమలు, ఎక్కడ చూసినా దోమలు. UN Sustainable Goals లో Clean & Green cities అనేది కూడా ఒక అంశం.

కానీ మన దేశం, కనీస క్రమ శిక్షణ లేని దేహం, దేశం. కనీస ఆర్థిక భద్రత, సామాజిక భద్రత, కుటుంబ భద్రత, బాధ్యత, ముసలితనం లో భద్రత…, యవ్వనంలో ఉద్యోగ భద్రత, సాంఘిక సంక్షేమ భద్రత….ఇవి అన్నీ గారంటీ గా ఉంటే, ప్రజలు కొంత శాంతితో ఉండే అవకాశం ఉంది.

మన దేశం, ప్రజలు, అజ్ఞానం, ఆత్మ న్యూనతా భావం, ప్రతీ క్షణం భయం, సమాజంలో గ్రామాల్లో అంతరాలు…., వీటి మధ్య మన ప్రజలు పరిశుభ్రత, పరిసరాల శుభ్రత పాటించాలి. శౌచం అంత తేలిక కాదు.

పొట్ట నిండిన వాడు కబుర్లు ఎన్ని అయినా చెబుతాడు. ఆకలితో ఉన్నవాడికి అన్నము కానీ సత్యముతో పని లేదు అనే మాట నిజం.

ఈ సమాజం నా కనీస అవసరాలు గుర్తించదు. కొందరు ఆకాశం, భూమి కలిపి పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఇంకొందరికి వివాహం కాదు. ఎవరు పట్టించుకోరు. కొందరు పంచ భక్ష్య పరమాన్నాలు తింటారు. ఇంకొందరు విస్తరి వెతుక్కుంటారు.
కాళోజీ చెప్పినట్టు అన్నపురాశులు ఒక వైపు, ఆకలి కేకలు ఒక వైపు, హంస తూలికలు ఒక వైపు, అలసిన దేహాలు ఒక వైపు….

మరి ఎలా సమతుల్యత?! ఇంకా ఎన్నాళ్ళు? కులం వల్ల, ప్రాంతం వల్ల ఆత్మ న్యూనతా భావం కలిగేలా నిస్సిగ్గుగా, నీది ఏ దిక్కు? ఆంధ్రా, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక…? నువ్వు ఎక్కడ వాడివి? ఏ కులం?

(మన రాజకీయ కార్పొరేట్ అవినీతి, మాఫియా చీకటి అన్ని రంగాల్లో…, ఇంత గాఢంధకారంలో మంచి మాటలు, నీతి సూక్తులు ఎవరు వింటారు. మెజారిటీ వర్గం ప్రజలు పాటించి చెబితే….ఏమో కొంత మార్పు రావొచ్చు)

లేదా డబ్బు! ఎక్కువ డబ్బు, హోదా ఉంటే, ఎన్నో సమసి పోతాయి.

ఇన్ని అసమానతలు మధ్య, శౌచం, యమ, నియమాలు(అష్టాంగ యోగా) సాధ్యమా?

సాయంకాలం, ఆరు బయట, మంచం వేసుకుని, ఆకాశంలో జాబిల్లిని చూస్తూ, చుక్కల వెనుక అనంతాన్ని ఆస్వాదిస్తూ…, చల్లటి గాలికి హృదయం, ఆత్మ స్పందిస్తుంటే…, కసుక్కున కసుక్కున దోమలు కుడతాయి! దుప్పటి మొత్తం ముసుగు కప్పిన, చిన్న బెజ్జం దొరికిన చాలు, ముక్కు మీద, కాళ్ళ మీద, కళ్ళ మీద ఎక్కడ బడితే అక్కడ కరుస్తాయి. అబ్బ,అబ్బ …అనుకోవాలి, అరుచుకోవాలి. దోమ తెరలు ప్రతీ రోజు ఎక్కడ కడతాము? ఆంధ్రాలో D.SC paper ఆందోళనలు, తెలంగాణలో నదీ జలాలపై మళ్ళీ ఏదో మంట పెట్టాలి అనే తాపత్రయం, జార్ఖండ్ లో విద్యార్థుల ఉద్యమం, ఎందుకు CJP అక్కడ active గా పాల్గోలేదు?! తమిళ నాడులో కావేరీ జలాలు పై విపక్షం తంజావూరులో ఆందోళన చేస్తూ, నటి త్రిష పై, అసందర్భ ప్రేలాపనలు! వీటన్నింటిపై National Media ఏమంటోంది? అర్ణబ్ గోస్వామి ఏం సందేశం ఇచ్చాడు?

ఈ పై వాటిని అన్నిటినీ, మన తెలుగు పత్రికల సంపాదకీయాలకు వదిలి వేద్దాం! నార్ల గారు ఉంటే ఏం రాసేవారు? కాశీనాధుని నాగేశ్వరరావు గారు ఉంటే ఏం రాసేవారు? ముద్దు కృష్ణ, శంభు ప్రసాద్ గారు, …ఇంకా ఎందరో అక్షరాలను ఉద్యమ కెరటాల్లా తెలుగు నేలపై ప్రవహింప చేశారు. ఇప్పుడు ఏం రాసినా చదివే వారు లేరు. Digitila Media యుగం. అక్కడ కూడా Over saturation వచ్చేసింది.

ప్రజల్లో, విసుగు, నిరాశ, నిస్సత్తువ. ఆసక్తి లేదు. ఈరోజుకి నాకు ఏమిటి? నా ఉద్యోగం ఉంటుందా? ఊడుతుందా? ఊడితే ఎన్నాళ్ళు బ్రతక గలను? ఇంట్లో ఖాళీగా ఉంటే పిచ్చి ఎక్కుతుంది.

కాసేపు ప్రజలు, నిద్ర సేద తీరుదాము అంటే ఈ దోమలు కాట్లు. ఎలా? పరిసరాల శుభ్రత ఎలా సాధించాలి? వర్షం వస్తే మన హైదరాబాద్ మునుగుతుంది. చెత్త ఎక్కడ పడితే అక్కడ కసిగా విసిరేస్తారు. డంపింగ్ యార్డు ల పని తీరు అధ్వాన్నం. “అమ్మా చెత్త బండి వచ్చిందమ్మా….” గుడ్డిలో మెల్ల.

దాంతో ప్రతీ గ్రామంలో దోమలు.
ఏదో చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి? ఎవరైనా చదివితే, పరిష్కారాలు చెప్పండి.
అందరూ సుఖంగా అన్నం తిని నిద్ర పోవాలి. దోమలు కుట్టని, హాయిగా నిద్ర పోయే భారత దేశం కావాలి. ఏం చేయాలో మీరే చెప్పండి. సత్యమేవ జయతే.

_____________________________________

తిరుమల బ్రహ్మోత్సవాలకు ఆండాళ్ మాలల సమర్పణ

తిరుమలలో ఏటా జరిగే బ్రహ్మోత్సవాలకు శ్రీ వెల్లిపుత్తూరు లో ఆండాళ్ అమ్మవారి తరపున పూలమాలలు సమర్పించే ఆనవాయితీ శతాబ్దాలుగా కొనసాగుతోంది. పూజ్య రామానుజాచార్యులు ప్రవేశపెట్టిన ఆ పవిత్ర సంప్రదాయం ప్రకారం ఊరేగింపుగా తీసుకువచ్చిన ఆ పవిత్ర మాలలను గరుడ సేవ రోజున తిరుమలేశునికి అలంకరింప చేస్తారు.
తిరుమలేశుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి కి అనువంశికాచారంగా బయటి ప్రాంతాలనుంచి సమర్పించే సమర్పణలలో శ్రీ వెల్లిపుత్తూరు మాలల సమర్పణకు ఎంతో ప్రత్యేకతలున్నాయి. శ్రీ వెల్లిపుత్తూరులో వెలిసిన శ్రీ రంగమన్నార్ స్వామికి పుష్ప కైంకర్యం చేసే విష్ణుచిత్తుడు తులసి తోటలో లభించిన పసిపాప కు గోదాదేవి అని పేరు పెట్టి కుమార్తె గా పెంచుకోసాగారు. శ్రీ రంగనాథుని భర్త గా భావించిన గోదాదేవి స్వామి కి ధరింప చేసే పుష్పమాలలను ముందుగా తాను ధరించేవారని ఆ విషయం తెలుసుకుని తండ్రి మందలించారని,. గోదాదేవి ధరించకుండా తనకు సమర్పించిన మాలలను శ్రీ రంగనాధుడు తిరస్కరించడంతో గోదాదేవి భక్తి ప్రపత్తులు లోకానికి తెలిసాయని శ్రీ కృష్ణదేవరాయలు రచించిన ఆముక్త మాల్యద అనే కావ్యం చాటిచెబుతోంది. ఆ గోదాదేవి భూదేవి ప్రతిరూపంగా ఆండాళ్ అమ్మవారిగా రంగమన్నార్ స్వామి చెంత పూజలందుకుంటున్నారు. ఆ ఐతిహ్యానికి బలం కల్పించే విధంగా పూజ రామానుజాచార్యులు తిరుమలలో స్వయంభువుగా వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి కి ఆండాళ్ అమ్మవారికి ధరింపచేసిన పుష్ప మాలలను ఏటా సమర్పించే సంప్రదాయాన్ని 11వ శతాబ్దంలో ప్రవేశపెట్టారు.

శతాబ్దాల చరిత్ర కలిగిన ఆ విధానం మేరకు ప్రతి సంవత్సరం శ్రీ వెల్లిపుత్తూరు నుంచి రెండు కుటుంబాలకు చెందిన ప్రతినిధులు భక్తితో, నిష్టతో చేమంతి,తులసి,సంపంగె పూలతో కలిపి కట్టిన మాలలను ముందు ఆండాళ్ అమ్మవారికి ధరింప చేసి ఊరేగింపుగా తిరుమలకు తీసుకు వచ్చి సమర్పిస్తూ వస్తున్నారు. ప్రత్యేకంగా తయారు చేసిన బుట్టలలో ఆండాళ్ మాల తో పాటు శిఖామణి అనే పేరుతో మరో మాల, పట్టు వస్త్రం . ప్రత్యేకంగా తయారు చేసిన చిలుక బొమ్మలు ఉంటాయి తోలి రోజుల్లో 600 కిలోమీటర్ల దూరం ఎడ్లబండ్లలో ఊరేగింపుగా తీసుకువచ్చే ఆ మాలలను ఇప్పుడు ప్రత్యేక వాహనాలలో తీసుకు వచ్చి తిరుమలలోని పెద్ద జియ్యంగార్ కు అందచేస్తారు. ఆపై జియ్యర్ స్వామి మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయంలోనికి తీసుకువెళ్లి స్వామికి సమర్పిస్తారు. ఆ మాలలను తిరుమలేశుని గరుడ సేవ రోజున స్వామికి అలంకరింప చేయడం సంప్రదాయంగా వస్తోంది. గరుడసేవ రోజు ఉదయం మోహినీ అవతారంలో దర్శనమిచ్చే మలయప్ప స్వామి చేతిలో ఆండాళ్ మాలలతో పాటు సమర్పించిన చిలుక బొమ్మలను ఇప్పటికీ కనులారా వీక్షించ వచ్చును. శ్రీ వెల్లిపుత్తూరు లో ఏటా ఆడి మాసంలో జరిగే ఉత్సవాలకు తిరుమలేశుని తరపున ఆండాళ్ అమ్మవారికి పసుపు కుంకుమలు, పట్టు వస్త్రాలను సమర్పించే ఆనవాయితీ దశాబ్దాలుగా కొనసాగుతోంది

ఓం నమో వేంకటేశాయ