న్యాయం చేయాలని రైతు కుటుంబం దీక్ష
చిట్యాల, ఆంధ్రప్రభ: తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చింతకుంట రామయ్యపల్లి గ్రామానికి చెందిన అబ్బెంగుల రాజయ్య కుటుంబం రెండు రోజులుగా నిరసన దీక్ష చేపట్టింది. ఎమ్మెల్యే వచ్చి తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ దీక్షకు దిగారు. బాధిత రైతు రాజయ్య తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 14 ఏళ్ల క్రితం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వద్ద భూమిని కొనుగోలు చేసి తన పేరుపై పట్టా చేసుకున్నానని తెలిపారు. అయితే భూమిని విక్రయించిన వ్యక్తి బంధువులు ఆ భూమి తమదేనంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
తన పొలంలో సాగు చేసిన పత్తి మొక్కలను పీకివేశారని, తనను చంపుతామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పేరు చెప్పుకుంటూ కొందరు తనను వేధిస్తున్నారని రాజయ్య ఆరోపించారు. బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ ఎమ్మెల్యే రావాలంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి దీక్ష చేపట్టినట్లు తెలిపారు. ఈ దీక్షలో బాధిత రైతు భార్య రాజేశ్వరి, పలువురు రైతులు పాల్గొన్నారు.
