ఉత్తమ తహసీల్దార్‌గా రోహిత్ దేశ్‌పాండే..

దండేపల్లి, ఆంధ్రప్రభ: దండేపల్లి మండల తహసీల్దార్ రోహిత్ దేశ్‌పాండే ఉత్తమ తహసీల్దార్‌గా అవార్డు అందుకున్నారు. ప్రభుత్వ సలహాదారు అర్కరా వేణుగోపాల్‌రావు, మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. విధుల పట్ల అంకితభావంతో పనిచేయడం, ప్రజలకు అందుబాటులో ఉంటూ రెవెన్యూ సేవలను సమర్థవంతంగా అందించడం, ప్రభుత్వ కార్యక్రమాల అమలులో చురుకైన పాత్ర పోషించినందుకు ఆయనకు ఈ గుర్తింపు లభించింది.

తహసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మండలంలోని రెవెన్యూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారని స్థానికులు తెలిపారు. ప్రజా సమస్యలపై స్పందిస్తూ, ప్రభుత్వ నిబంధనల ప్రకారం సేవలు అందించడంలో రోహిత్ దేశ్‌పాండే చూపుతున్న చొరవను పలువురు అభినందించారు. ఉత్తమ తహసీల్దార్‌గా అవార్డు అందుకోవడం పట్ల దండేపల్లి మండల ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, రెవెన్యూ సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ అవార్డు మరింత బాధ్యతతో ప్రజలకు సేవ చేసేందుకు ప్రోత్సాహాన్ని ఇస్తుందని రోహిత్ దేశ్‌పాండే తెలిపారు.