పాఠశాలకు కొమురం భీం పేరు పెట్టడం హర్షనీయం

  • ఆదివాసి విద్యార్థుల అభివృద్ధికి పాఠశాలల కృషి అభినందనీయం

జైనూర్, ఆంధ్రప్రభ: ఆదివాసుల ఆరాధ్య దైవం, పోరాట వీరుడు కొమురం భీం పేరును పాఠశాలకు పెట్టడం ఎంతో సంతోషకరమని జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమేత విశ్వనాథరావు అన్నారు. శనివారం మండల కేంద్రంలోని కొమురం భీం మెమోరియల్ పాఠశాల, జైనూర్ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఆయనతో పాటు అసిఫాబాద్ మాజీ గ్రంథాలయ చైర్మన్ కనక యాదవ్‌రావు, జైనూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కొడప ప్రకాశ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ విశ్వనాథరావు మాట్లాడుతూ.. ఆదివాసి విద్యార్థుల విద్యాభివృద్ధికి పాఠశాలలు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.

బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరచడం హర్షణీయమని, ఇదే స్ఫూర్తితో రాష్ట్ర స్థాయిలోనూ రాణించాలని ఆకాంక్షించారు. మాజీ గ్రంథాలయ చైర్మన్ కనక యాదవ్‌రావు కూడా విద్యార్థులను అభినందించారు. పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు అతిథులు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పార్వతి, కొమురం భీం మెమోరియల్ పాఠశాల కరస్పాండెంట్ సోయం భీమ్రావు, తుడుం దెబ్బ ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు గోడం గోపీచంద్, జైనూర్ మాజీ వైస్ ఎంపీపీ చిర్లే లక్ష్మణ్ యాదవ్, పవర్‌కూడ సర్పంచ్ తోడసం రాజేందర్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ గేడం లక్ష్మణ్, నాయకులు, పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.