తలకిందులుగా జాతీయ జెండా.. స్థానికంగా వివాదం
కోటపల్లి, ఆంధ్రప్రభ: కోటపల్లి మండల వ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామపంచాయతీ కార్యాలయాలు, అంగన్వాడీ కేంద్రాల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించి వేడుకలు నిర్వహించారు. అయితే దేవులవాడ కె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేయడం స్థానికంగా వివాదానికి దారితీసింది.
పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరావు జెండాను ఆవిష్కరించిన అనంతరం స్థానికులు ఈ విషయాన్ని గుర్తించి తెలియజేశారు. దీంతో జాతీయ గీతాలాపన అనంతరం జెండాను సరిచేశారు. అనంతరం విద్యార్థులు, గ్రామస్తులకు స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు, అధికారులు, విద్యార్థులు, గ్రామపంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
