సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడితే కఠిన చర్యలు
చిట్యాల, ఆంధ్రప్రభ : సోషల్ మీడియా వేదికల్లో ఇతరులను కించపరిచేలా, వ్యక్తిగతంగా దూషించేలా పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తప్పవని చిట్యాల ఎస్ఐ పోచంపల్లి సతీష్ హెచ్చరించారు.
శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వాట్సాప్, ఫేస్బుక్ తదితర సామాజిక మాధ్యమ గ్రూపుల్లో ఇతరుల మనోభావాలను దెబ్బతీసే విధంగా అనుచిత వ్యాఖ్యలు, వివాదాస్పద పోస్టులు, మెసేజ్‌లు షేర్ చేయవద్దని సూచించారు.
అసభ్యకర, దూషణకరమైన కంటెంట్‌ను పోస్టు చేసిన వారితో పాటు ఆయా గ్రూపుల నిర్వాహకులపైనా చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ తెలిపారు.
ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ సతీష్ స్పష్టం చేశారు.
