పారిశుధ్య నిర్వహణ మరింత సమర్థవంతం
ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం: ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
నందిగామ రూరల్, ఆంధ్రప్రభ: నగర పంచాయతీ పరిధిలో పారిశుధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టేందుకు నూతనంగా ఏర్పాటు చేసిన కాంపెక్టర్, జనరేటర్‌ను శుక్రవారం నగర పంచాయతీ ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అధికారులు, కూటమి నేతలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ.. పట్టణాన్ని పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. పట్టణంలో పారిశుధ్య నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులను బలోపేతం చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
నూతన కాంపెక్టర్ జనరేటర్ అందుబాటులోకి రావడంతో చెత్త సేకరణ, తరలింపు ప్రక్రియ మరింత సులభతరం కావడంతో పాటు పారిశుధ్య సిబ్బందికి కూడా పనిభారం తగ్గుతుందని పేర్కొన్నారు. ప్రజలు కూడా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు నగర పంచాయతీ సిబ్బందికి సహకరించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.
పట్టణ అభివృద్ధి, పారిశుధ్యం, మౌలిక వసతుల విషయంలో ఎక్కడా రాజీ లేకుండా ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని సౌమ్య గారు తెలిపారు. నందిగామను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ అధికారులు, సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
