రెపరెపలాడిన త్రివర్ణ పతాకం

  • 100 అడుగుల జాతీయ జెండాతో విద్యార్థుల ర్యాలీ
  • ర్యాలీలో ఎమ్మెల్యే నాయకర్

నరసాపురం, ఆంధ్రప్రభ: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా నరసాపురం పట్టణంలో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్‌ ఆధ్వర్యంలో శ్రీ సూర్య కళాశాల విద్యార్థులతో కలిసి 100 అడుగుల జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు.జనసేన పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ బస్‌స్టాండ్‌, పట్టణ ప్రధాన వీధుల మీదుగా అంబేద్కర్‌ సెంటర్‌ వరకు సాగింది. భారీ జాతీయ జెండా ర్యాలీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్‌ మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగాలు చేసిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. దేశభక్తి భావం ప్రతి భారతీయుడి హృదయంలో నిత్యం ఉండాలని, యువత స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

జాతీయ జెండా దేశ ఐక్యతకు, సమగ్రతకు, గౌరవానికి ప్రతీక అని పేర్కొన్న ఆయన.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పండుగలా భావించి ఘనంగా నిర్వహించుకోవాలని, దేశభక్తిని చాటాలని కోరారు.అనంతరం పట్టణంలోని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సూర్య కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్‌ ఘంటసాల బ్రహ్మాజీ, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు కోటిపల్లి వెంకటేశ్వరరావు, జనసేన నాయకులు, కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు, జనసైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.