గుంతలమయమైన రహదారి…

రూ.237 కోట్ల పనుల కోసం ఎదురుచూపులు
గుంతల రోడ్డుతో గర్భిణులు, రోగుల అవస్థలు..
పనులు ప్రారంభించాలని డిమాండ్

మక్తల్, ఆంధ్రప్రభ : మక్తల్–నారాయణపేట రోడ్డు అభివృద్ధికి రెండుసార్లు శంకుస్థాపనలు జరిగినా పనులు ప్రారంభం కాకపోవడంపై బీజేపీ రాష్ట్ర నాయకుడు, మక్తల్ మాజీ ఎంపీపీ కొండయ్య ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రోడ్డు పనులు ఎప్పుడు ప్రారంభిస్తారో, ఎప్పటిలోగా పూర్తి చేస్తారో స్పష్టంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

2025 డిసెంబర్ 1న మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మక్తల్–నారాయణపేట రోడ్డు అభివృద్ధికి శంకుస్థాపన చేశారు. అనంతరం 2026 జూలై 13న మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి కలిసి రూ.237 కోట్లతో నిర్మించనున్న నాలుగు లైన్ల రోడ్డుకు మరోసారి శంకుస్థాపన చేసి పైలాన్‌ను ఆవిష్కరించారు.

రెండుసార్లు శంకుస్థాపన చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని, శంకుస్థాపనలు జరిగినా పనులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయో ముఖ్యమంత్రి, మంత్రులు మక్తల్ నియోజకవర్గ ప్రజలకు, నారాయణపేట జిల్లా ప్రజలకు సమాధానం చెప్పాలని కొండయ్య డిమాండ్ చేశారు.

శనివారం మక్తల్ నుంచి నారాయణపేటకు వెళ్లే ప్రధాన రహదారి పరిస్థితిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రోడ్డుపై ఉన్న గుంతలు రెండు నుంచి మూడు అడుగుల లోతు వరకు ఉన్నాయని, ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో ప్రజలు, వాహనదారులు ఎలా ప్రయాణించాలని ప్రశ్నించారు.

రోడ్డు అధ్వాన పరిస్థితి కారణంగా జిల్లా ఆసుపత్రికి వెళ్లే అంబులెన్సులు, అత్యవసర వైద్యం కోసం వెళ్లే రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా గర్భిణులు ప్రయాణించే సమయంలో తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి, మంత్రులకు చిత్తశుద్ధి ఉంటే రోడ్డు పనులు ప్రారంభించే తేదీ, పూర్తి చేసే గడువును ప్రకటించాలని కొండయ్య సవాల్ చేశారు. మక్తల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న స్థానిక మంత్రి ఈ రోడ్డుపై ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించాలని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి పనుల అమలులో ఉన్న తేడాను ప్రజలు గమనించాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో చేపడుతున్న భారత్‌మాల రహదారి పనులను నిర్ణీత గడువులో పూర్తి చేసే లక్ష్యంతో ముందుకు సాగుతుండగా, మక్తల్–నారాయణపేట రోడ్డు విషయంలో శంకుస్థాపనలు జరిగినా పనులు ప్రారంభం కాకపోవడం విచారకరమన్నారు.

శంకుస్థాపన చేసినా పనులు ముందుకు సాగకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న ఈ రహదారి పనులను ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపడతామని హెచ్చరించారు.