కైకలూరులో పోలీసు సిబ్బందికి పరేడ్‌

నేర పరిశోధనలో అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన

కైకలూరు, ఆంధ్రప్రభ: ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు, ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో కైకలూరులో పోలీసు సిబ్బందికి ప్రత్యేక పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కైకలూరు రూరల్ సీఐతో పాటు కైకలూరు, ముదినేపల్లి, మండవల్లి, కలిదిండి పోలీస్ స్టేషన్ల ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. పరేడ్‌లో భాగంగా సిబ్బంది క్రమశిక్షణ, యూనిఫాం నిర్వహణ, విధి నిర్వహణకు సంబంధించిన అంశాలను అధికారులు పరిశీలించారు.

ఈ సందర్భంగా పోలీసు అధికారులు సిబ్బందికి పలు సూచనలు చేశారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు. అలాగే నేరాల నియంత్రణ, నేరాల దర్యాప్తులో అనుసరించాల్సిన విధానాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా నేరం జరిగిన ప్రదేశంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిందితులు వదిలి వెళ్లిన ఆధారాలను భద్రపరచడం, క్లూస్ టీం సహాయంతో సాక్ష్యాలను సేకరించడం వంటి అంశాలపై సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కైకలూరు ఎస్సై బి. రాంబాబు, మండవల్లి ఎస్సై సి.హెచ్. రామచంద్రరావుతో పాటు పలువురు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.