పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత
భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించేందుకు మొక్కలు నాటాలి: కలెక్టర్ వెట్రిసెల్వి
ఏలూరు/దెందులూరు, ఆంధ్రప్రభ: పర్యావరణాన్ని పరిరక్షించి భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పేర్కొన్నారు.80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా దెందులూరు మండలం ఎస్‌ఎంఆర్ నగర్‌లోని అన్నా క్యాంటీన్ వద్ద శుక్రవారం జిల్లా కలెక్టర్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ, 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమంలా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ కనీసం రెండు మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని సూచించారు.
పర్యావరణ పరిరక్షణలో మొక్కలు నాటడం ఒక మంచి అలవాటుగా మారాలని, గ్రామీణ ప్రాంతాల్లో పచ్చదనం పెంపొందించడం, పర్యావరణ సమతుల్యతను కాపాడటం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. నాటిన మొక్కలను నిరంతరం సంరక్షించి అవి ఆరోగ్యంగా పెరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ, గ్రామాల్లో పచ్చదనం పెంపొందించడంతో పాటు భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు విస్తృతంగా మొక్కలు నాటాల్సిన అవసరం ఉందన్నారు. నాటిన ప్రతి మొక్కను చెట్టుగా ఎదిగే వరకు అధికారులు, సిబ్బంది, గ్రామస్థులు ప్రత్యేక శ్రద్ధతో సంరక్షించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో పి. జగదాంబ, ఆర్డీవో కె. లక్ష్మీప్రసన్న, జిల్లా పంచాయతీ అధికారి జి.వి.కె. మల్లికార్జునరావు, డీఆర్‌డీఏ పీడీ టి.వి. విజయలక్ష్మి, తహసీల్దార్ బి. సుమతి, డిప్యూటీ ఎంపీడీవో ఎం. భీమరాజు, వివిధ శాఖల అధికారులు, ఏఎంసీ చైర్మన్ గారపాటి రామసీత, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
