అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ మంజూరు చేయాలి..
- 10వ వార్డు కౌన్సిలర్ పసుల లావణ్య రమేష్
పరకాల, ఆంధ్రప్రభ : పరకాల పట్టణంలోని మాదారం ఎస్సీ కాలనీలో అంబేద్కర్ కమ్యూనిటీ ఫంక్షన్ హాల్ మంజూరు చేయాలని కోరుతూ మున్సిపల్ పదో వార్డు కౌన్సిలర్ పసుల లావణ్య రమేష్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ మాదారం కాలనీలోని దళితుల కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 1979-80 సంవత్సరంలో భూమిని కొనుగోలు చేసి, సుమారు 255 మంది పేద ఎస్సీ కుటుంబాలకు ఇంటి స్థలాలను కేటాయించిందన్నారు. అలాగే విద్యార్థుల కోసం పాఠశాల, వివాహాలు, ఇతర సామాజిక కార్యక్రమాల నిర్వహణ కోసం సుమారు 20 గుంటల స్థలాన్ని కేటాయించినట్లు తెలిపారు.
ఆ స్థలంలో అంబేద్కర్ కమ్యూనిటీ ఫంక్షన్ హాల్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని కోరారు. సుమారు 40 వేల జనాభా ఉన్న పరకాల పట్టణ నడిబొడ్డున ఈ హాల్ ఏర్పాటు చేస్తే పేద దళిత కుటుంబాల వివాహాలు, ఇతర కార్యక్రమాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.
మమతానగర్ ముంపు సమస్య పరిష్కరించాలని వినతి..
పరకాల మున్సిపాలిటీ 10వ వార్డు పరిధిలోని ఆర్టీసీ డిపో గోడను ఆనుకుని ఉన్న సుమారు 12 అడుగుల వెడల్పు పంట కాలువ నిరుపయోగంగా మారడంతో ఆక్రమణలకు గురైందని కౌన్సిలర్ తెలిపారు.
కాలువ ఆక్రమణల కారణంగా వర్షపు నీరు సక్రమంగా వెళ్లకుండా లోతట్టు ప్రాంతమైన మమతానగర్ కాలనీకి చేరుతోందని, దీంతో కాలనీ వాసుల ఇళ్లలోకి నీరు చేరి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
ఆక్రమణలకు గురైన కాలువను పరిరక్షించి, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసి మమతానగర్ ముంపు సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డికి వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పసుల భద్రయ్య, పసుల రాజ్‌కుమార్, దుప్పటి క్రాంతికుమార్, జిల్లెల్ల సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.
