మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్యే ప్రభుత్వ లక్ష్యం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ వ్యవహారాల సలహాదారు ఎం.ఏ. షరీఫ్
మచిలీపట్నం, ఆంధ్రప్రభ: మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి, భోజనం, మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ వ్యవహారాల సలహాదారు ఎం.ఏ. షరీఫ్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ వ్యవహారాల సలహాదారు ఎం.ఏ. షరీఫ్ గురువారం మచిలీపట్నం చిలకలపూడిలోని ఏపీఆర్‌ఎస్ మైనారిటీ బాలుర పాఠశాలను సందర్శించారు.
విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడుతూ పాఠశాలలో విద్య, వసతి, భోజనం, పారిశుద్ధ్యం, బాత్‌రూమ్‌లు తదితర సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలని, అందుబాటులో ఉన్న విద్యా అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.
అనంతరం విద్యార్థులకు స్వయంగా మధ్యాహ్న భోజనం వడ్డించి, వారితో కలిసి భోజన సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఉన్నా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని, వారి విద్యాభ్యాసానికి అవసరమైన సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
విద్యార్థులు అందుబాటులో ఉన్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని, మైనారిటీ విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందని, ఉర్దూ భాష అభివృద్ధితో పాటు మైనారిటీ విద్యార్థులకు ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని అన్నారు.
మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 12 మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు, 3 మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు పనిచేస్తున్నాయని ఎం.ఏ. షరీఫ్ తెలిపారు. విద్యార్థులు పాఠ్యాంశాలతో పాటు క్రీడలు, ఇతర సహపాఠ్య కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొనాలని సూచించారు.
ఉర్దూ భాషాభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా ప్రత్యేక డీఎస్సీ ద్వారా 1,100 ఉర్దూ ఉపాధ్యాయ పోస్టులు, మెగా డీఎస్సీ ద్వారా సుమారు 1,200 ఉర్దూ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసినట్లు తెలిపారు.
అలాగే ఆర్థికంగా వెనుకబడిన మైనారిటీ వర్గాల అభ్యున్నతికి మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు, సుమారు 25 వేల మంది మైనారిటీలు రుణాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.
మైనారిటీ విద్యార్థుల్లో ప్రతిభను ప్రోత్సహించేందుకు ‘హునర్ తాలీమే హునర్’ కార్యక్రమం ద్వారా పదో తరగతిలో 70 శాతానికి పైగా మార్కులు సాధించిన పేద మైనారిటీ విద్యార్థులకు ఉన్నత విద్యకు అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో 250 మంది విద్యార్థుల కోసం నిర్వహించిన ఎంపిక ప్రక్రియకు 7,400 మంది దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఏపీ స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ హసీమ్ బేగ్, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి అబ్దుల్ రబ్బాని, జిల్లా మైనార్టీ నాయకులు అజీమ్, ఐదోవ డివిజన్ ఇంచార్జ్ రత్నారావు, ఏడవ డివిజన్ ఇన్చార్జి పి భరత్, నాలుగోవ డివిజన్ ఇన్చార్జి కె. సుశీల, ప్రిన్సిపాల్ రవి, ఈడీ మైనారిటీ కార్పొరేషన్ ఫర్జానా, ఎంఈఓ ఎంవి దుర్గాప్రసాద్, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
