వైసీపీపై మంత్రి కొల్లు ఫైర్‌

  • అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నేతల పిచ్చి ప్రేలాపణలు
  • అమరావతి గురించి మాట్లాడే నైతిక అర్హత కూడా వైసీపీకి లేదు
  • మెగా డీఎస్సీ పేరుతో యువతను దగా చేసిన ఘనత వైసీపీదే
  • అభివృద్ధి అడ్డుకుంటే ఉపేక్షించేది లేదని మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్

మచిలీపట్నం, ఆంధ్రప్రభ: వైసీపీ నేతలు రోడ్డెక్కి ఆరోపణలు చేయడం కాదు.. ప్రజలు ఇచ్చిన తీర్పుపై గౌరవం, చట్టసభలపై నమ్మకం ఉంటే అసెంబ్లీకి రావాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సవాల్ చేశారు. మచిలీపట్నం ఆర్ అండ్ బీ గస్ట్ హౌస్‌లో మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతలకు ఆరోపణలు చేయడం, పారిపోవడం అలవాటుగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేకే వైసీపీ నేతలు పిచ్చి ప్రేలాపణలకు పోతున్నారన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ రాత్రింబవళ్లు రాష్ట్ర అభివృద్ధి, శాంతిభద్రతల కోసం పని చేస్తున్నారు. నిరంతరం సమీక్షలు సమావేశాలతో ఏపీకి పెట్టుబడులు పరిశ్రమల కోసం తపిస్తున్నారు. ప్రతి వీడియో కాన్ఫరెన్స్‌లోనూ పోలీసు అధికారులతో లా అండ్‌ఆర్డర్‌పై సమీక్షిస్తున్నారు. బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు అహర్నిశలు పనిచేస్తుంటే.. గతంలో అధికారంలో ఉన్న వారు ఏం చేశారో ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు.

‘దిశ చట్టం’ పేరుతో ప్రజలను మభ్యపెట్టారు..

మహిళలు, ఆడబిడ్డల భద్రత విషయంలో గత ప్రభుత్వం చేసిన ప్రచారానికి, ఆచరణకు పొంతన లేదని మంత్రి విమర్శించారు. దిశ చట్టం పేరుతో ప్రజలను మభ్యపెట్టడం తప్ప మహిళల భద్రతకు గత ప్రభుత్వం చేసిందేమీ లేదని ఆరోపించారు. రాష్ట్రంలో గంజాయి, మాదకద్రవ్యాల నియంత్రణలో వైసీపీ ప్రభుత్వంలోని పెద్దలే ప్రత్యక్షంగా భాగస్వాములయ్యారు. కానీ నేడు రాష్ట్రంలో మహిళల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోంది. అసలు లేని చట్టం గురించి వైసీపీ నేతలు ఎందుకు ఇంతలా యాగీ చేస్తున్నారో వారికే తెలియాలని ఎద్దేవా చేశారు.

అమరావతిపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నేతలకు లేదు..

మూడు రాజధానుల పేరుతో డ్రామాలాడి, అమరావతి రైతుల్ని ముప్పుతిప్పలు పెట్టిన వారు.. అమరావతి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. అమరావతిపై వైసీపీ నేతలకు మాట్లాడే నైతిక హక్కు లేదు. గత ఐదు సంవత్సరాలు అమరావతి రైతుల్ని ఎంతలా హింసించారో, ఎంతలా వేధించారో ప్రపంచం మొత్తం చూసింది. చివరికి వారు కట్టుకున్న చీరల గురించి కూడా అవమానకరంగా మాట్లాడిన నీచ సంస్కృతి వైసీపీ నేతలది. అలాంటి వైసీపీ నేతలు నేడు అమరావతిపై కపట ప్రేమను ప్రదర్శించడం మానుకోవాలని హితవు పలికారు.
అమరావతిలో సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు, స్టీల్ బ్రిడ్జి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతులమీదుగా ప్రారంభించుకోవడం హర్షణీయం. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే టెండర్లు, నిర్మాణ పనులపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ప్రపంచస్థాయి నాణ్యతతో తక్కువ ఖర్చుతో నాణ్యమైన నిర్మాణాలు చేపడుతున్న ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి విమర్శలు చేయడానికి వైసీపీ నేతలు సిగ్గుపడాలన్నారు.

మెగా డీఎస్సీపై మాట్లాడే హక్కు ఎక్కడిది?

మెగా డీఎస్సీ గురించి మాట్లాడుతున్న వైసీపీ నేతలు గత ఐదు సంవత్సరాలు చేసిన ఘనకార్యాన్ని గుర్తు చేసుకోవాలి. ఏటా మెగా డీఎస్సీ, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ హామీలు ఏమయ్యాయో వైసీపీ నేతలు, జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీని పూర్తి చేసి 16 వేల మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించింది. వారంతా ఉద్యోగాల్లో చేరిపోయిన తర్వాత రాద్దాంతం చేయడానికి బుద్ధి ఉండాలన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు దండగ అన్న వారు.. ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు వచ్చిన ప్రయోజనాలను ప్రజలు చూస్తున్నారు. పోలవరం ప్రాజెక్టును రానున్న రోజుల్లో పూర్తి చేసి రాష్ట్రానికి మరింత ప్రయోజనం చేకూరుస్తామని మంత్రి పేర్కొన్నారు.

‘దమ్ముంటే అసెంబ్లీకి రండి.. చర్చిద్దాం’

మచిలీపట్నం అభివృద్ధిపై తాను బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని కొల్లు రవీంద్ర ప్రకటించారు. పేర్ని నానికి ధైర్యం ఉంటే మచిలీపట్నం అభివృద్ధిపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని పేర్ని నానికి సవాల్ విసిరారు. రాష్ట్ర అభివృద్ధిపై గానీ, వైసీపీ నేతలు చేస్తున్న డీఎస్సీ, శాంతిభద్రతలు, అభివృద్ధి అంశాలన్నింటిపైనా కూలంకషంగా చర్చిద్దామని సవాల్ చేశారు. మచిలీపట్నం అభివృద్ధిపై తాను చేసిన పనులను ప్రజలకు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని, విమర్శలు చేస్తున్న వారు తాము చేసిన పనులపై కూడా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయంగా ఆరోపణలు, ప్రత్యారోపణలు చేయడం కంటే ప్రజల సమస్యలు, అభివృద్ధి అంశాలపై చర్చకు రావాలని సూచించారు.

గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భూకేటాయింపులు, బియ్యం వ్యవహారాలు, ఇతర అంశాలపై కూడా మాజీ మంత్రి సమాధానం చెప్పాలని కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు. అయితే వీటిపై వచ్చిన ఆరోపణలు, న్యాయపరమైన అంశాలను సంబంధిత కోర్టు తీర్పులు, అధికారిక రికార్డుల ఆధారంగానే చూడాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునేలా తప్పుడు ప్రచారం, నిరాధార ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని మంత్రి హెచ్చరించారు. ప్రజలకు వాస్తవాలను వివరించేందుకు టీడీపీ సిద్ధంగా ఉందని, అభివృద్ధి, సంక్షేమం, శాంతిభద్రతలపై బహిరంగ చర్చకు ఎప్పుడైనా సిద్ధమని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.