గంటలోనే గల్లంతైన బ్యాగ్ రికవరీ

సీసీ కెమెరాల ఆధారంగా గుర్తింపు.. నందిగామ సర్కిల్ పోలీసుల చురుకైన స్పందన

నందిగామ రూరల్, ఆంధ్రప్రభ : ప్రయాణంలో గల్లంతైన విలువైన బ్యాగ్‌ను నందిగామ సర్కిల్ పోలీసులు గంట వ్యవధిలోనే రికవరీ చేసి బాధితుడికి సురక్షితంగా అప్పగించారు. బ్యాగులో విలువైన డాక్యుమెంట్లు, బంగారం, నగదు ఉండటంతో పోలీసులు వెంటనే స్పందించి సీసీ కెమెరాల ఆధారంగా గాలింపుచేపట్టారు.హైదరాబాద్ నుంచి ట్రావెల్స్ కారులో ప్రయాణించిన ఓ వ్యక్తి నందిగామలో దిగిన అనంతరం తన విలువైన బ్యాగ్ కనిపించకపోవడాన్ని గుర్తించాడు. వెంటనే నందిగామ సీఐ శ్రీనుకు సమాచారం అందించాడు.

ఎన్టీఆర్ కమిషనరేట్ ఆదేశాల మేరకు ఏసీపీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో, సీఐ శ్రీను ఆధ్వర్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించి బ్యాగ్ ప్రయాణించిన మార్గాన్ని గుర్తించారు.కానిస్టేబుల్ సంతోష్ చురుకైన చర్యలతో గంట వ్యవధిలోనే బ్యాగ్‌ను రికవరీ చేసి బాధితుడికి అప్పగించారు. విలువైన వస్తువులతో కూడిన బ్యాగ్‌ను సురక్షితంగా తిరిగి అందించిన పోలీసులకు బాధితుడు కృతజ్ఞతలు తెలిపారు.సమయస్ఫూర్తి, సాంకేతిక పరిజ్ఞానం, వేగవంతమైన స్పందనతో నందిగామ పోలీసులు మరోసారి తమ విధినిబద్ధతను చాటుకున్నారు.