రైతుల పేరుతో యూరియా మాయాజాలం..
- అధికారుల తనిఖీల్లో బట్టబయలు
- యాప్‌లో రైతులకు ఇచ్చినట్లు నమోదు చేసి..
- ఇతర మండలాల వారికి యూరియా తరలింపు
- టేకుమట్ల మండలంలో వ్యవసాయ శాఖ అధికారుల కొరడా
టేకుమట్ల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి గ్రామంలోని తేజస్వి ట్రేడర్స్ ఎరువుల దుకాణంపై మండల వ్యవసాయ అధికారి కళ్యాణి తనిఖీలు నిర్వహించారు. యూరియా బుకింగ్ యాప్‌లో బుక్ చేసుకున్న రైతులకు యూరియా బస్తాలు అందించినట్లు యాప్‌లో నమోదు చేసి, వాస్తవానికి ఆ బస్తాలను ఇతర మండలాలకు చెందిన వారికి ఎలాంటి రసీదులు ఇవ్వకుండా విక్రయించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో సంబంధిత డీలర్‌పై వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు.
ఇందులో భాగంగా డీలర్‌కు ఉన్న ఎరువుల లైసెన్స్‌ను సస్పెండ్ చేసినట్లు మండల వ్యవసాయ అధికారి కళ్యాణి తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… యూరియా బుకింగ్ యాప్‌లో బుక్ చేసుకున్న రైతులకే తప్పనిసరిగా యూరియా బస్తాలను అందించాలని డీలర్లకు స్పష్టం చేశారు. యూరియాను నిర్ణీత ధర కంటే అధిక ధరలకు విక్రయించకూడదని, ప్రతి విక్రయానికి తప్పనిసరిగా రైతులకు బిల్లు ఇవ్వాలని హెచ్చరించారు.ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించినా, యాప్‌లో ఒక రైతు పేరుతో నమోదు చేసి ఇతరులకు యూరియా విక్రయించినా, బిల్లులు ఇవ్వకుండా విక్రయాలు జరిపినా సంబంధిత డీలర్లపై శాఖాపరమైన కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.
