చేయూత పథకం పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం..
- ఈనెల 31 వరకు స్వీకరణ అర్హులు దరఖాస్తులు చేసుకోవాలి
- కడెం ఎంపీడీఓ బి. అరుణ
కడెం, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చేయూత పెన్షన్ పథకానికి అర్హులైన లబ్ధిదారుల నుంచి ఈ నెల 31వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు నిర్మల్ జిల్లా కడెం ఎంపిడిఓ బి. అరుణ బుధవారం ఆంధ్రప్రభ తెలిపారు. అర్హులైన వారు తమ గ్రామ పంచాయతీ లేదా మండల పరిషత్ కార్యాలయంలో నిర్ణీత గడువులోగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులతో పాటు కల్లు గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులు, డయాలసిస్ చికిత్స పొందుతున్న వారు తదితర అర్హులైన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపిడిఓ కోరారు.
వితంతువులకు 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉండడంతో పాటు భర్త మరణ ధృవీకరణ పత్రం అవసరం. ఒంటరి మహిళలకు 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉండాలి. భర్త వదిలివేసిన మహిళలు విడాకుల కోర్టు ఉత్తర్వు లేదా తహసీల్దార్ విచారణ నివేదిక సమర్పించాలి. కనీసం ఏడాది కాలంగా విడిగా నివసిస్తున్నట్లు ధృవీకరణ అవసరం. అవివాహిత మహిళలకు గ్రామీణ ప్రాంతాల్లో 30 సంవత్సరాలు, పట్టణ ప్రాంతాల్లో 35 సంవత్సరాల వయస్సు ఉండాలి. వికలాంగులకు వయస్సుతో సంబంధం లేకుండా 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉండాలి. వినికిడి వైకల్యం విషయంలో 51 శాతం వైకల్యం అవసరం.
యు డి ఐ డి లేదా సదరం ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. కల్లు గీత కార్మికులు, చేనేత కార్మికులకు 50 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉండాలి. సంబంధిత శాఖల ధ్రువీకరణ పత్రాలు అవసరం. గ్రేడ్-2, గ్రేడ్-3 ఫైలేరియా బాధితులకు డీఎం అండ్ హెచ్‌ఓ నమోదు, ధ్రువీకరణ అవసరం. డయాలసిస్ రోగులకు ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ ద్వారా నమోదు, ధ్రువీకరణ అవసరమని తెలిపారు. దరఖాస్తుల గడువు ముగిసిన అనంతరం అందిన దరఖాస్తులను పరిశీలించబోమని ఎంపీడీవో స్పష్టం చేశారు. అర్హులైన వారు చివరి తేదీ వరకు వేచి చూడకుండా వెంటనే దరఖాస్తులు సమర్పించాలని ఆమె కోరారు.
