CM Chandrababu | 12 టవర్లు.. 288 ఫ్లాట్లు..!

అమరావతిలో అదిరిపోయే భవనాలు!
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు కొత్త ఇళ్లు
చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం
అమరావతిలో మరో కీలక ఘట్టం
రాయపూడిలో ప్రజాప్రతినిధుల భవనాలు
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు లగ్జరీ ఫ్లాట్లు
అమరావతిలో కొత్త నివాస సముదాయం
సీఎం చంద్రబాబు ప్రారంభోత్సవం
జీఏడీకి భవనాల అప్పగింత


CM Chandrababu | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. రాజధాని ప్రాంతంలో నిర్మాణం పూర్తైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాస భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. గురువారం జరిగిన కార్యక్రమంలో సీఆర్డీఏ నూతన భవన సముదాయాన్ని సీఎం చేతుల మీదుగా సాధారణ పరిపాలన శాఖకు అప్పగించింది.

రాజధాని పరిధిలోని రాయపూడి వద్ద 12 టవర్లుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం ఈ నివాస సముదాయాన్ని నిర్మించారు. ఒక్కో ఫ్లాట్‌ సుమారు 3,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండేలా మొత్తం 288 ఫ్లాట్లను సీఆర్డీఏ నిర్మించింది. ప్రజాప్రతినిధులకు అవసరమైన సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని భవనాలను ఆధునిక ప్రమాణాలతో తీర్చిదిద్దారు.

భవన సముదాయంలో అత్యాధునిక వసతులతో పాటు టవర్ల మధ్య ప్రత్యేకంగా పచ్చదనం, లాన్లు ఏర్పాటు చేశారు. రాజధాని ప్రాంతంలో నిర్మిస్తున్న శాశ్వత భవనాల్లో భాగంగా ఈ నివాస సముదాయం అందుబాటులోకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

భవనాల ప్రారంభం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు నారాయణ, నాదెండ్ల మనోహర్‌తో కలిసి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల కోసం నిర్మించిన ఫ్లాట్లను పరిశీలించారు. భవనాల్లో కల్పించిన సౌకర్యాలు, నిర్మాణ నాణ్యత, పరిసరాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించినట్లు సమాచారం.

ఇక నూతన భవన సముదాయాన్ని సాధారణ పరిపాలన శాఖకు అప్పగించిన నేపథ్యంలో వాటి నిర్వహణ బాధ్యతలు ఇకపై జీఏడీ పరిధిలోకి వెళ్లనున్నాయి. ప్రభుత్వం నిర్ణయించే విధానానికి అనుగుణంగా భవనాల్లోని ఫ్లాట్లను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేటాయించే ప్రక్రియను చేపట్టే అవకాశం ఉంది.

అమరావతిని రాష్ట్ర రాజధానిగా అభివృద్ధి చేసే క్రమంలో శాసనసభ్యులు, శాసనమండలి సభ్యుల కోసం ప్రత్యేక నివాస సముదాయం అందుబాటులోకి రావడం మరో ముఖ్యమైన మైలురాయిగా అధికారులు పేర్కొంటున్నారు.