ద్వారకలో డిజిటల్ వ్యవసాయ శిక్షణ ప్రారంభం..
దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలం ద్వారక గ్రామంలో రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతికతపై శిక్షణ కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. ఆత్మ ఆధ్వర్యంలో 30 మంది రైతులకు రెండు విడతల్లో శిక్షణ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సహాయ వ్యవసాయ సంచాలకులు కృష్ణ మాట్లాడుతూ.. రైతులు పంటల సాగుకు సంబంధించిన వాతావరణ పరిస్థితులు, పురుగు–తెగుళ్ల నివారణ, మార్కెట్ ధరలు, ప్రభుత్వ సేవలు తదితర సమాచారాన్ని మొబైల్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుని శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేయాలని సూచించారు.
కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మహేష్ మాట్లాడుతూ.. పంటల్లో వచ్చే పురుగు, తెగుళ్లను గుర్తించి సకాలంలో నివారణ చర్యలు చేపట్టేందుకు ఆధునిక సాంకేతిక సాధనాలు ఉపయోగపడతాయన్నారు. రైతులు నమ్మకమైన సమాచారాన్ని వినియోగించుకోవాలని సూచించారు.శిక్షణలో ఎరువుల సమాచారం, రైతు నమోదు, పంటల్లో పురుగు–తెగుళ్ల గుర్తింపు, వాతావరణ సమాచారం, మార్కెట్ ధరలు, పంట నిర్వహణ తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ సింగతి మురళి, వ్యవసాయ విస్తరణ అధికారులు సాయి కృష్ణ, శ్రీనివాస్, మౌనిక, శ్రీకన్య, శ్రవణ్, ద్వారక సర్పంచ్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
