సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు..
- పైలాన్, నూతన కలెక్టరేట్ భవన సముదాయాల పరిశీలన
- రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క
ములుగు, ఆంధ్రప్రభ ప్రతినిధి : ములుగు జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం ములుగు జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఏర్పాటు చేస్తున్న పైలాన్ నిర్మాణ పనుల పురోగతిని, నూతన కలెక్టరేట్ భవన సముదాయాన్ని మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్ లతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి కి ఇప్పటి వరకు పూర్తయిన పనులు, ఇంకా చేపట్టాల్సిన పనుల వివరాలను పంచాయతీ రాజ్ ఈ ఈ అజయ్ కుమార్ వివరించారు.ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ… ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ముందస్తుగానే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పైలాన్ నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పనుల నిర్వహణలో ఎలాంటి జాప్యానికి తావులేకుండా సంబంధిత శాఖల అధికారులు, గుత్తేదారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.
అనంతరం నూతన కలెక్టరేట్ భవన సముదాయాన్ని పరిశీలించిన మంత్రి, భవనంలోని వివిధ విభాగాలు, కార్యాలయ గదులు, సమావేశ మందిరాలు, పరిసరాల్లో చేపడుతున్న పనులను పరిశీలించారు. కలెక్టరేట్ ప్రాంగణంలో పారిశుధ్యం, విద్యుత్, తాగునీరు, రహదారులు, పార్కింగ్తో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూర్చాలని సూచించారు.ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి లోటుపాట్లకు అవకాశం లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, అప్పగించిన బాధ్యతలను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు.
ఈ నెల 16న ములుగు కు సీఎం : మంత్రి సీతక్క.
ఈ నెల 16న ముఖ్యమంత్రి ఎనిముల రేవంత్ రెడ్డి ములుగు నియోజకవర్గంలో పర్యటించనున్నారని మంత్రి సీతక్క మీడియా సమావేశంలో వెల్లడించారు. మధ్యాహ్నo సమయంలో మేడారం చేరుకుని శ్రీ సమ్మక్క–సారలమ్మ వనదేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని పేర్కొన్నారు.అనంతరం వనదేవతల సన్నిధి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన వితంతు మహిళలు, ఒంటరి మహిళలకు సంతృప్త స్థాయిలో పింఛన్లు అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని తెలిపారు.ఆగస్టు 3 వరకు దరఖాస్తు చేసుకున్న వారిని గతంలో అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం పరిశీలించి అర్హులను ఎంపిక చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
మేడారం కార్యక్రమాల అనంతరం ముఖ్యమంత్రి ములుగు జిల్లా కేంద్రం నకు చేరుకుని, రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్ శాఖ ద్వారా మూడు విడతల్లో సుమారు రూ.16 వేల కోట్లతో చేపట్టనున్న హ్యామ్ రోడ్ల పనులకు సంబంధించిన అభివృద్ధి పనుల పైలాన్‌ను గట్టమ్మ సమీపంలో ఆవిష్కరిస్తారని తెలిపారు. ప్రతి గ్రామానికి మెరుగైన రహదారి అనుసంధానం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ విధానంలో పెద్ద ఎత్తున రహదారి పనులను చేపట్డడం జరుగుతుందని పేర్కొన్నారు.అనంతరం ముఖ్యమంత్రి నూతన కలెక్టరేట్‌కు చేరుకుని తొలుత తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి, నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు.
అనంతరం కలెక్టరేట్ ఆవరణంలో ఏర్పాటు చేసే సభలో ప్రజలు, అభిమానులను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తారని తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు ములుగు నియోజకవర్గ, జిల్లా ప్రజలు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని మంత్రి ఆహ్వానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సీహెచ్ మహేందర్, సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవీ చందర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
