అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం – ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్సియస్ నెస్
ఈ పేరు నేడు ఒక ఆధ్యాత్మిక విప్లవానికి పర్యాయపదం
కృష్ణ చైతన్యనికి మారుపేరు. హరినామ సంకీర్తన ధ్యేయం గా, శ్రీమద్ భగవద్ గీత పునాదిగా, శ్రీమద్ భాగవతం, శ్రీ చైతన్య మహా ప్రభు బోధనలు ఆలంభనగా విరాజిల్లుతోంది…..
హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే….
హరే రామ హరే రామ రామ రామ హరే హరే అనే మహమంత్రం భక్తులు నిత్యం వందలు, వేలసార్లు జపిస్తూ ధార్మిక జగత్తు లో ఓలలాడుతున్నారు. భౌతిక సుఖాలకు పాకులడకుండా శాశ్వతమైన గోలోకాబృందావనాన్ని చేరుకోవాలని తపిస్తుంటారు….ఏ.సి.భక్తివేదాంత స్వామి ఈ సంస్థ వ్యవస్థాపక ఆచార్యులు. తదనంతరం వీరే శ్రీల ప్రభుపాదులు గా వ్యవహారింపబడినారు. ఇస్కాన్ ను భక్తి వేదాంత స్వామి 1966 జులై 13 న న్యూయర్క్ లో ఏర్పాటు చేశారు. అలా ఈ సంస్థ ఏర్పడి 60 సంవత్సరాలు పూర్తయినాయి. ఇటీవలనే ఉత్సవాలు జరిగాయి. ఇంకా జరుగుతున్నాయి.
ఇస్కాన్ స్థాపించాక వారు ప్రపంచవ్యాప్తంగా 108 కృష్ణ మందిరాలను నెలకొల్పారు. అందులో భాగంగా మనదేశంలో వారు తన స్వహాస్తాలతో మాయాపూర్, కొలకత్తా, బృందావనం, హైదరాబాద్ లో ఇస్కాన్ మందిరాలను ప్రతిష్టించారు. హైదరాబాద్ ఆబిడ్స్ లోని ఇస్కాన్ – శ్రీ రాధా మదన మోహన మందిరాన్ని 1976 ఆగస్టు 18 న ప్రతిష్టించారు. అంటే ఈనెల 18 తో ఈ మందిరం స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి. ఒకవైపు ఇస్కాన్ ఏర్పడి 60 సంవత్సరాలు, ఇస్కాన్ హైదరాబాద్- ఆబిడ్స్ మందిరం 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్బంగా వీటి వివరాలు ఒకసారి పరిశీలిద్దాం…..భక్తివేదాంత స్వామి కలకత్తా లో 1896 సెప్టెంబర్ 1 న సాంప్రదాయ గౌడియ వైష్ణవ కుటుంబంలో జన్మించారు. తల్లి దండ్రులు పెట్టిన పేరు అభయ్. ఉన్నత చదువులు ఒకవైపు, కృష్ణ భక్తి మరో వైపు అభయ్ స్వంతం.

సంప్రదాయంగా వచ్చిన భక్తితో పాటు వారి తండ్రి మోహన్ డే కున్న అపారమైన భక్తి వీరికి కూడా బాల్యం నుండే అబ్బింది. అదే తదనంతర కాలంలో తన ఆధ్యాత్మిక ప్రయాణానికి బాటలు వేసింది. తన ఆధ్యాత్మిక ప్రయాణం లో భాగంగా వేదాంత స్వామి 1922 లో శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ను కలిశారు. ఈ సందర్బంగా ఠాకూర్ మాట్లాడుతూ ఆంగ్ల బాష తెలిసిన మీరు పాశ్చాత్య దేశాలలో కృష్ణ చైతన్యం ప్రచారం చేయాలని అభిలాషించారు. అలాగే 1932 లో సరస్వతి ఠాకూర్ మరోమారు వేదాంతస్వామికి ఒక సూచన చేశారు.అదేంటంటే… నీవద్ద డబ్బులు ఉంటే కృష్ణ చైతన్యం పుస్తకాలు ప్రచురించాలని, రచనలు చేయాలని అన్నారు. 1935 లో వారివద్దనే వేదాంతస్వామి దీక్ష తీసుకున్నారు. 1944 లో కలకత్తా నుండి బ్యాక్ టు హెడ్ పత్రికను ప్రారంభించారు. అనేక ఒదుదుడుకులు ఎదురైనప్పటికీ పత్రికను ప్రచురించారు.
కృష్ణ చైతన్యం కొరకు కృషిచేశారు. పత్రిక ప్రచురణ, కృష్ణ చైతన్యం లక్ష్యం గా ఢిల్లీ తరుచుగా వెళ్లేవారు. ఎందరినో కలిసి సహకరించాలని అభ్యర్థించేవారు. అయినా చేయూత లభించలేదు. కృష్ణ ప్రచారం పోరాటంలో బృందావనానికి తన మకాన్ని మార్చారు. అంతేకాకుండా 1959 లో సన్యాసం స్వీకరించారు. గురువు ఆజ్ఞ మేరకు పుస్తకం ప్రచురణ, అనువాదం చేయటం ప్రారంభించారు. ఆశించిన రీతిలో ఆధ్యాత్మిక ప్రయాణం సాగటం లేదని గుర్తించి ఆమెరికా వెళ్లి ప్రచారం చేయాలని తలంచారు. చేతిలో డబ్బులు లేవు. వెళ్ళాక ఎక్కడ ఉండాలో తెలియదు. అయినా సంకల్పం చెక్కుచెదరలేదు. ఎట్టకేలకు సింధియా స్టీమ్ షిప్ లైన్ సంస్థ అధినేత్రి సుమతి మురార్జీ ని వేదాంతస్వామి ఒప్పించి, మెప్పించి వారి సరుకు రవాణా చేసే షిప్ లో ఒక సీట్ ఉచితంగా అందునా అమెరికాకు వెళ్లేందుకు, తిరిగి వచ్చేందుకు సంపాదించారు.

అలా వారు 1965 ఆగస్టు 13 న కలకత్తా షిప్ హార్బర్ నుండి జలదూత అనే షిప్ లో ప్రయాణమైనారు. 37 రోజుల ప్రయాణం తర్వాత సెప్టెంబర్ 19 న న్యూయార్క్ చేరుకున్నారు. పెన్సిల్వెనియా రాష్ట్రం లోని బట్లర్ నగరంలో ఉన్న గోపాల్ ఆగర్వాల్ ఇంటికి వెళ్లారు. అనంతరం అనేక ప్రదేశాలలో తిరుగుతూ కృష్ణ చైతన్యం బోధనలు ఇవ్వసాగారు. అయితే ఆరోజులలో అమెరికాలోని చాలా ప్రాంతాలలో యువత హిప్పి కల్చర్ కలిగి, మత్తు మందులు, మాదక ద్రవ్యాలు, తాగుడుకు బానిసలై ఉండటాన్ని గమనించిన వేదాంతస్వామి ఆశ్చర్యకరంగా వారి మధ్యనే నివసించాల్సిన పరిస్థితులు నెలకొని ఉండేవి.
ఎన్ని ఆటంకాలు, అవరోధాలు ఆధిగమించి, అనేక వ్యయ ప్రయాసలకు గురైనారు. అమెరికాలో 9 నెలలకు పైగా నిర్విరామంగా కృష్ణ బోధనలు చేస్తూ, చివరకు కొంతమంది కళాకారులూ , సంగీతం తెలిసిన వారు, భారత ఆధ్యాత్మికం, కృష్ణచైతన్యం పట్ల విశ్వాసం ఉన్న వ్యక్తుల తొడ్పాటుతో వేదాంతస్వామి తనకంటూ ఒక ఆశ్రయం ఏర్పాటుచేసుకున్నారు. న్యూయార్క్ లోని 26 సెకండ్ అవెన్యూ స్టోర్ ఫ్రంట్ లో కృష్ణ సందేశాలు ఇవ్వడానికి హాల్ , తాను నివాసం ఉండేందుకు ఒక గది కల భవనం లోకి తన మకాంని మార్చారు. అక్కడి నుండే కృష్ణ చైతన్య ప్రచారం కార్యక్రమాలు, భజనలు, హరినామ సంకీర్తనలు, శ్రీమద్ భగవద్ గీత, భాగవతం, కృష్ణ సంబంద గ్రంధాలపై ప్రవచనాలు భక్తివేదాంత స్వామి ఇచ్చారు.
ఈ కృష్ణ చైతన్య యాత్రలో చిరస్థాయి గా నిలిచేందుకు వారు 1966 జులై 13 న ఇస్కాన్ ను అక్కడే స్థాపించారు. అనేకానేక కార్యక్రమాలు, పద్ధతులు అమలు చేశారు. పూర్తి స్థాయి సంస్థ గా రూపాకల్పన చేశారు. పుస్తక రచనలు, అనువాదాలు, ప్రచురణల కొరకు భక్తి వేదాంత బుక్ ట్రస్ట్ ను నెలకొల్పారు. కృష్ణ చైతన్యం ఎంతో, ఎంతో విస్తరించారు. శ్రీ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి తదనంతరం శ్రీల ప్రభుపాదులు గా ప్రసిద్ధి చెందారు. ఎంతో మందికి దీక్షలు ఇచ్చారు. 70 కి పైగా వైదిక గ్రంధాలు, కృష్ణ చైతన్య పుస్తకాలకి సంబందించి సంపుటాలు రచించారు, అనువదించారు,అలాగే వాటికి వ్యాఖ్యనాలు రాసారు. వీరి గ్రంధాలు 80 కి పైగా భాషలలోకి అనువదింపబడినాయి. భగవద్ గీత యధాతథం, శ్రీమద్ భాగవతం, శ్రీ చైతన్య చరితామృతం, భక్తి రసామృతం, శ్రీ ఈషోపనిషత్తు, ఉపదేశామృతం, దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు వంటి అనేక సుప్రసిద్ధమైన గ్రంధాలు కొన్ని ఇవి.
క శ్రీల ప్రభుపదులవారు కేవలం 11 సంవత్సరాల వ్యవధి లో 14 సార్లు ప్రపంచాన్ని చుట్టి వచ్చారు.తన జీవిత కాలం అంతా కృష్ణ సేవలో, ఆచార్యుల మార్గనిర్దేశంలో గడిపిన శ్రీల ప్రభుపాదులవారు 1977 నవంబర్ 14 న తనువు చాలించారు. నేడు అనేక దేశాలలో ఇస్కాన్ – కృష్ణ మందిరాలున్నాయి. కోట్లల్లో ఇస్కాన్ భక్తులున్నారు. వివిధ సేవ కార్యక్రమాలు, ఉచిత భోజన వితరణ, విద్యాసంస్థలు, గోశాలలు,గురుకులాలు, వర్ణాశ్రమాలు, సమాజ హితం కోసం పనులు చేస్తూ, మరోవైపు భక్తి యుత సేవ చేస్తూ ఇస్కాన్ నేడు ఆధ్యాత్మిక భూలోక బృదావనం గా తీర్చిదిద్దబడింది. ముఖ్యంగా జగన్నాథ రథ యాత్రలు అన్నిచోట్లా నిర్వహిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా 150 కి పైగా దేశాలలో ఇస్కాన్ – కృష్ణ చైతన్య కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. 900 కు పైగా ఇస్కాన్ – రాధా కృష్ణ మందిరాలు నెలకొల్పబడినాయి. 75 కోట్ల భక్తి గ్రంధాలు ప్రపంచ దేశాలలో అనేక భాషలలో వితరణ చేయటం జరిగింది. 600 కోట్ల ప్లేట్ ల ఉచిత ప్రసాద భోజనాలు పంపిణీ చేశారు.
50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శ్రీ శ్రీ రాధా మదన మోహన మందిరం హైదరాబాద్ ఆబిడ్స్ లోని ఇస్కాన్ శ్రీ శ్రీ రాధా మదన మోహన మందిరం ఈ నెల 18 వ తేదీ తో 50 సంవత్సరాలు పూర్తిచేసుకుని, స్వర్ణత్సవ శోభను సంతరించుకుంది. శ్రీల ప్రభుపాదులు 1976 ఆగస్టు 18 న ఈ మందిరం లో శ్రీ శ్రీ రాధా మదన మోహన, శ్రీ శ్రీ గౌర నితాయి, శ్రీ శ్రీ జగన్నాథ, సుభద్ర, బలదేవ విగ్రహాలను ప్రతిష్టించారు. 50 ఏళ్ళ ప్రస్థానాన్ని అత్యంత వైభవం గా ఆలయ కమిటీ నిర్వహిస్తోంది. ఈ సందర్బంగా ఆగస్టు 15, 16, 17, 18 తేదీ లలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా 5 లక్షల భోజనాలు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ప్రత్యేక గీతాన్ని ఆవిష్కరిస్తారు. 50 ఏళ్ళ ప్రస్థానంలో సేవలందించిన వారికి సత్కారం చేయాలని నిర్ణయించారు.
శ్రీల ప్రభుపాదుల వారి భక్తియుత నిస్వార్థ సేవ ఆదర్శనీయం
భార్య, పిల్లలు , కుటుంబ సభ్యులను, భౌతిక సంపదలు వదిలి 70 సంవత్సరాల వయస్సులో రెండు సార్లు గుండెపోటు కు గురైనప్పటికి గురు ఆదేశం శిరసావహించి చెక్కు చెదరని కృష్ణ విశ్వాసం తో నౌక లో ప్రయాణం చేశారు. అమెరికా లో ఏమాత్రం అనుకూలం కానీ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకుని అక్కడి వారిని ముఖ్యంగా యువతను కృషచైతన్యంలోకి తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు. ఎంతో గొప్పనైన ఘట్టం. సరళ మైన జీవనం, నిస్వార్థ భక్తి సేవ, కార్యదీక్షత, సాధించాలనే పట్టుదల వారి జీవితం నుండి మనకు సదా ఆదర్శనీయమైనవి…..
– డి.శ్రీనివాస్
