నిజామాబాద్ జిల్లాలో యాక్సిడెంట్
ఇద్దరు మహిళలు మృతి
పంచర్ కావడంతో నిలిపిన ప్రైవేట్ బస్సు..
వెనుక నుంచి బలంగా ఢీకొట్టిన లారీ
డివైడర్‌పై కూర్చున్న మహిళలపైకి దూసుకెళ్లిన బస్సు..
అక్కడికక్కడే మృతిచెందిన ఇద్దరు
ఆర్మూర్, ఆంధ్రప్రభ: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోవింద్‌పేట్ ఫ్లైఓవర్‌పై ఆగి ఉన్న ప్రైవేట్ బస్సును కంటైనర్ లారీ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు డివైడర్‌పై కూర్చున్న ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు.
పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. ప్రైవేట్ బస్సు టైర్ పంచర్ కావడంతో డ్రైవర్ దాన్ని గోవింద్‌పేట్ ఫ్లైఓవర్‌పై రోడ్డుపక్కన నిలిపాడు. బస్సు మరమ్మతు కోసం ఆగిన సమయంలో ఇద్దరు మహిళలు బస్సు ఎదురుగా ఉన్న డివైడర్‌పై కూర్చున్నారు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన కంటైనర్ లారీ అదుపు తప్పి ఆగి ఉన్న బస్సును బలంగా ఢీకొట్టింది.
కంటైనర్ ఢీకొనడంతో బస్సు ఒక్కసారిగా ముందుకు కదిలింది. దీంతో డివైడర్‌పై కూర్చున్న మహిళలపైకి బస్సు దూసుకెళ్లింది. బస్సు టైర్లు వారి మీదుగా వెళ్లడంతో తీవ్రంగా గాయపడిన ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంతో ఫ్లైఓవర్‌పై ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొంది.
మృతుల వివరాలు తెలియాల్సి ఉంది
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాదానికి కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కంటైనర్ లారీ డ్రైవర్ వేగం, నిర్లక్ష్యం తదితర అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
