విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి..
- కలెక్టరేట్ ముందు ధర్నా చేసిన ఎస్ఎఫ్ఐ
భూపాలపల్లి టౌన్, ఆంధ్రప్రభ : జిల్లావ్యాప్తంగా విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని, పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ముట్టడి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు బొడ్డు స్మరణ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా రూ.10,500 కోట్లకు పైగా స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫాంలు అందించాలని కోరారు. జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలన్నారు.
ఈ నెల 3 నుంచి 6 వరకు ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన జీపు యాత్రలో గుర్తించిన విద్యారంగ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. మహదేవపూర్‌లో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలకు పోస్టుమెట్రిక్ హాస్టళ్లు మంజూరు చేయాలని, కాటారం జూనియర్ కళాశాల, ఐటీఐలకు సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. కేజీబీవీల్లో మౌలిక వసతులు కల్పించాలని, దామరకుంట గురుకుల బాలికల హాస్టల్‌లో ఇంటర్మీడియట్ విద్యను పునరుద్ధ రించాలని కోరారు. సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు సమీర్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.
