ఎరువుల పంపిణీలో నూతన విధానం..

  • ఎఫ్ఎఫ్ఎస్ యాప్ ద్వారా మాత్రమే ఎరువుల పంపిణీ

లక్ష్మణచాంద, ఆంధ్రప్రభ : రైతులకు ఎరువులు పారదర్శకంగా, అవసరానికి అనుగుణంగా, సులభతరంగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ‘ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్’ (ఎఫ్ఎఫ్ఎస్) అనే నూతన డిజిటల్ విధానాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఈ విధానంలో భాగంగా 2026 ఆగస్టు 17 నుంచి రైతులకు ఎరువుల పంపిణీ పూర్తిగా ఈ యాప్ ద్వారానే నిర్వహించబడుతుంది.

ఇప్పటి వరకు అమలులో ఉన్న విధానానికి భిన్నంగా ఇకపై రైతులు తమ సాగు అవసరాలకు అనుగుణంగా ముందుగానే యాప్‌లో నమోదు చేసుకుని ఎరువులను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. రైతు వివరాలు, సాగు భూమి, పంట వివరాలు, అవసరమైన ఎరువుల సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఎరువుల పంపిణీ ప్రక్రియ జరుగుతుంది. దీనివల్ల రైతులకు అవసరమైన ఎరువుల ప్రణాళికను మరింత సమర్థవంతంగా రూపొందించడంతో పాటు పంపిణీ ప్రక్రియలో పారదర్శకత పెరుగుతుంది.

యాప్‌లో రైతులు ఎలా నమోదు చేసుకోవాలి?

రైతులు తమ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్‌లో గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఎఫ్ఎఫ్ఎస్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని నమోదు చేసుకోవాలి. ఫార్మర్ ఐడీ ఉన్న రైతులు ఫార్మర్ ఐడీ లేదా ఆధార్ సంఖ్య ద్వారా లాగిన్ అయి, ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ ద్వారా తమ వివరాలను ధ్రువీకరించుకోవచ్చు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత రైతు భూమి వివరాలు స్వయంచాలకంగా యాప్‌లో అందుబాటులోకి వస్తాయి. ఫార్మర్ ఐడీ లేని రైతులు ఆధార్ సంఖ్యతో ఈ-కేవైసీ పూర్తి చేసి, ఓటీపీ ధ్రువీకరణ అనంతరం నమోదు ప్రక్రియను కొనసాగించవచ్చు.

భూమి వివరాలు కనిపించకపోతే ఏమి చేయాలి?

కొంతమంది రైతుల భూమి వివరాలు ఫార్మర్ రిజిస్ట్రీలో అందుబాటులో లేకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో యాప్‌లో ఉన్న ‘సింక్ ల్యాండ్స్ విత్ ఫార్మర్ రిజిస్ట్రీ’ సదుపాయాన్ని ఉపయోగించి భూమి వివరాలను సమకాలీకరించుకోవచ్చు. అయినప్పటికీ భూమి వివరాలు అందుబాటులోకి రాకపోతే ‘యాడ్ / క్లెయిమ్ ల్యాండ్’ ద్వారా భూమి వివరాలను నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఇందులో రైతులు తమ యాజమాన్య హోదా లేదా సాగుదారునికి సంబంధించిన వివరాలను నమోదు చేసి భూమి వివరాలను సమర్పించవచ్చు.

పంట వివరాల నమోదు తప్పనిసరి

భూమి వివరాల నమోదు పూర్తయిన తర్వాత రైతులు ప్రస్తుత సీజన్‌లో సాగు చేయబోయే పంటను తప్పనిసరిగా ఎంపిక చేయాలి. అనంతరం ఏ భూమికి ఎరువులు అవసరమో ఆ భూమిని ఎంపిక చేసి, ఆయా పంటలకు అవసరమైన ఎరువుల వివరాలను నమోదు చేయాలి. యాప్‌లో భూమి విస్తీర్ణం, ఎంపిక చేసిన పంట ఆధారంగా జనరల్ ఫర్టిలైజర్ రికమండేషన్ (జీఎఫ్‌ఆర్) కూడా అందుబాటులో ఉంటుంది. రైతులు అవసరాన్ని బట్టి సూచించిన పరిమాణాన్ని లేదా తమ అవసరానికి అనుగుణంగా పరిమాణాన్ని ఎంపిక చేసుకోవచ్చు.

ఎరువుల బుకింగ్ – క్యూఆర్ కోడ్ విధానం

రైతులు తమకు అనుకూలమైన ఎరువుల విక్రయ కేంద్రాన్ని ఎంపిక చేసిన తర్వాత దరఖాస్తు సమర్పిస్తే యాప్‌లో క్యూఆర్ కోడ్, టోకెన్ నంబర్ రూపొందుతుంది. ఆ క్యూఆర్ కోడ్ ఆధారంగా రైతులు ఎరువులను పొందవచ్చు. రైతు స్వయంగా లేదా తాను అధీకృతం చేసిన వ్యక్తి ద్వారా కూడా ఎరువులను స్వీకరించే సౌకర్యం ఈ యాప్‌లో కల్పించారు.

రైతులకు ప్రయోజనాలు

ఈ నూతన విధానం ద్వారా రైతుల వివరాలు, సాగు భూమి, సాగు పంట ఆధారంగా ఎరువుల అవసరాన్ని ముందుగానే అంచనా వేయడం సులభమవుతుంది. అలాగే ఎరువుల పంపిణీ ప్రక్రియ మరింత పారదర్శకంగా, క్రమబద్ధంగా సాగేందుకు అవకాశం కలుగుతుంది. రైతులు తమ దరఖాస్తు స్థితిని యాప్ ద్వారా తెలుసుకోవడంతో పాటు సులభంగా ఎరువులు పొందగలుగుతారు. మండలంలోని రైతులందరూ ఎరువుల అవసరం వచ్చిన తర్వాత కాకుండా ముందుగానే ఎఫ్ఎఫ్ఎస్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి బి. నాగరాజు సూచించారు.

ఫార్మర్ ఐడీ, ఆధార్, మొబైల్ నంబర్, భూమి వివరాలను సిద్ధంగా ఉంచుకుని నమోదు పూర్తి చేసుకోవాలని తెలిపారు. యాప్ వినియోగంలో ఏవైనా సందేహాలు లేదా నమోదు సంబంధిత ఇబ్బందులు ఎదురైనట్లయితే తమ గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈవో) లేదా ఎరువుల విక్రయ కేంద్రాలను సంప్రదించి అవసరమైన సహాయం పొందవచ్చని సూచించారు. 2026 ఆగస్టు 17 నుంచి అమలులోకి రానున్న ఎఫ్ఎఫ్ఎస్ విధానాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని పూర్తిస్థాయిలో సహకరించాలని మండల వ్యవసాయ అధికారి బి. నాగరాజు కోరారు.