ప్రముఖ డ్యాన్సర్, జర్నలిస్ట్ చిలువేరి దుర్గాప్రసాద్ అకాల మృతి
భీమ్‌గల్ పట్టణ ప్రజల్లో విషాదం
భీమ్‌గల్ టౌన్/రూరల్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ పట్టణంలోని నందిగల్లికి చెందిన దివంగత చిలువేరి వామన్ (విశ్రాంత ఉపాధ్యాయుడు) ఏకైక కుమారుడు చిలువేరి దుర్గాప్రసాద్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది.
దుర్గాప్రసాద్ అకాల మరణంతో భీమ్‌గల్ పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి విషయం తెలియడంతో సహాధ్యాయులు, మిత్రులు, జర్నలిస్టులు, రాజకీయ పార్టీల నాయకులు, భీమ్‌గల్ పట్టణంతోపాటు మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు.
దుర్గాప్రసాద్ జర్నలిస్టుగా పనిచేస్తూ స్థానికంగా పలువురితో సన్నిహితంగా మెలిగారు. చిన్ననాటి నుంచే మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమానిగా పేరొందిన ఆయన, చిరంజీవి మాదిరిగానే నడక, హావభావాలు, డ్యాన్స్ చేయడంలో ప్రత్యేకత చూపుతూ అందరినీ ఆకట్టుకునేవారు.
చిరంజీవి పాటలు, డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టపడే దుర్గాప్రసాద్ తనదైన శైలిలో ప్రదర్శనలు చేస్తూ స్నేహితులు, పరిచయస్తుల అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఎప్పుడూ ఉత్సాహంగా, అందరితో కలివిడిగా ఉండే ఆయన ఇక లేరన్న వార్తతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరూ విషాదంలో మునిగిపోయారు.
దుర్గాప్రసాద్ మృతి కుటుంబ సభ్యులతోపాటు మిత్రులు, సహచరులు, అభిమానులకు తీరని లోటుగా మారింది. ఆయన మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న పలువురు, దుర్గాప్రసాద్ సేవలు, స్నేహపూర్వక స్వభావాన్ని స్మరించుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
