Vijayawada | బెర్మ్‌ పార్క్‌లో భద్రతకు పెద్దపీట

  • బోటింగ్‌ నిర్వహణలో అప్రమత్తతే కీలకం
  • వాష్‌రూమ్‌ నిర్మాణాల్లో నాణ్యత ఉండాలి
  • బోట్ల ఫిట్‌నెస్‌ నిర్ధారించాకే వినియోగం
  • కంట్రోల్‌ రూమ్‌ నిరంతర పర్యవేక్షణ
  • పర్యాటకుల సౌకర్యమే లక్ష్యంగా అభివృద్ధి
  • ఏపీటీడీసీ చైర్మన్ నూకసాని బాలాజీ

విజయవాడ, ఆంధ్రప్రభ: బెర్మ్‌ పార్క్‌కు వచ్చే పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు బోటింగ్‌ కార్యకలాపాలను మరింత సురక్షితంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని ఏపీటీడీసీ చైర్మన్‌ డా. నూకసాని బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం నగరంలోని బెర్మ్‌ పార్క్‌ను సందర్శించిన ఆయన అక్కడ కొనసాగుతున్న అభివృద్ధి పనులు, నూతనంగా నిర్మిస్తున్న వాష్‌రూమ్‌లు, బోటింగ్‌ యూనిట్‌ను పరిశీలించారు. పర్యాటకుల సౌకర్యం, భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.

నిర్మాణాల్లో నాణ్యతముఖ్యం..

బెర్మ్‌ పార్క్‌లో నూతనంగా నిర్మిస్తున్న వాష్‌రూమ్‌ల పనులను చైర్మన్‌ బాలాజీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతి, ఉపయోగిస్తున్న సామగ్రి నాణ్యత, నిర్దేశిత రూపకల్పన, సాంకేతిక ప్రమాణాల అమలుపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పర్యాటకుల అవసరాలకు అనుగుణంగా వాష్‌రూమ్‌లు సౌకర్యవంతంగా, పరిశుభ్రంగా, దీర్ఘకాలం వినియోగించుకునేలా నిర్మించాలన్నారు. నిర్మాణ నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడరాదని స్పష్టం చేస్తూ, పనులను నిర్ణీత ప్రమాణాలతో వేగంగా పూర్తి చేసి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.

బోట్ల భద్రతపై ప్రత్యేక దృష్టి..

అనంతరం బోటింగ్‌ యూనిట్‌ను పరిశీలించిన డా. బాలాజీ, ప్రస్తుతం కొనసాగుతున్న బోటింగ్‌ కార్యకలాపాలపై ఆరా తీశారు. పర్యాటకులను తరలించేందుకు వినియోగిస్తున్న బోట్ల పరిస్థితి, నిర్వహణ, భద్రతా ప్రమాణాలు, ఫిట్‌నెస్‌ తదితర అంశాలను పరిశీలించారు. బోట్లను నిరంతరం తనిఖీ చేస్తూ, వాటి ఫిట్‌నెస్‌, భద్రతా ప్రమాణాలను పూర్తిగా నిర్ధారించిన అనంతరం మాత్రమే వినియోగించాలని అధికారులకు సూచించారు. బోటింగ్‌ సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా విధులు నిర్వహించాలని, అవసరమైన భద్రతా పరికరాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అప్రమత్తంగా కంట్రోల్‌ రూమ్‌..

బోటింగ్‌ కార్యకలాపాల పర్యవేక్షణలో కంట్రోల్‌ రూమ్‌ కీలకపాత్ర పోషిస్తుందని చైర్మన్‌ నూకసాని బాలాజీ పేర్కొన్నారు. నిర్దేశిత నిబంధనలు, భద్రతా మార్గదర్శకాలకు అనుగుణంగా కంట్రోల్‌ రూమ్‌ను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. బోటింగ్‌ కార్యకలాపాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగాలని, ఏదైనా సమస్య లేదా అత్యవసర పరిస్థితి ఎదురైతే తక్షణమే స్పందించేలా కంట్రోల్‌ రూమ్‌ను సన్నద్ధంగా ఉంచాలని స్పష్టం చేశారు. పర్యాటకుల భద్రతలో నిర్లక్ష్యానికి తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలన్నారు.

పరిశుభ్రత, సౌకర్యాలపై..

బెర్మ్‌ పార్క్‌కు వచ్చే పర్యాటకులకు ఆహ్లాదకరమైన, సురక్షితమైన అనుభూతి కల్పించేందుకు పార్క్‌ పరిసరాల పరిశుభ్రత, మౌలిక వసతుల నిర్వహణ, పర్యాటక సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఏపీటీడీసీ చైర్మన్ డా. బాలాజీ సూచించారు. పర్యాటకుల అవసరాలను ముందుగానే గుర్తించి అందుకు అనుగుణంగా సదుపాయాలను మెరుగుపరచాలని అన్నారు. పార్క్‌ అభివృద్ధి, బోటింగ్‌ నిర్వహణ, పర్యాటకులకు అందుతున్న సౌకర్యాలపై అధికారులతో సమీక్షించి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. పర్యాటకుల సౌకర్యం, భద్రతే ప్రధాన లక్ష్యంగా ప్రతి అధికారి, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు.