అవగాహనతో ఎయిడ్స్‌ను జయిద్దాం
- హెచ్‌ఐవీ నియంత్రణకు సకాలంలో పరీక్షలు
- క్రమం తప్పని మందులే కీలకం
- అపోహలు వీడి శాస్త్రీయ సమాచారాన్ని తెలుసుకోవాలి
- కలెక్టర్ లక్ష్మీశ
- హెచ్‌ఐవీ బాధితుల పట్ల వివక్ష వద్దు.. అండగా నిలవాలి
విజయవాడ, ఆంధ్రప్రభ: హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతో పాటు ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకునేలా చైతన్యపరచాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. అవగాహన, అప్రమత్తత, సకాలంలో వైద్య పరీక్షలు, వైద్యుల సూచనల మేరకు క్రమం తప్పకుండా మందులు వినియోగించడం ద్వారా హెచ్‌ఐవీని నియంత్రించవచ్చని తెలిపారు. హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన కల్పించేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో బుధవారం విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అవగాహన ర్యాలీ నిర్వహించారు.
కలెక్టర్ లక్ష్మీశ ర్యాలీని ప్రారంభించి స్వయంగా పాల్గొన్నారు. విద్యార్థులు, వైద్య సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ప్లకార్డులు, నినాదాలతో హెచ్‌ఐవీ నివారణ, నియంత్రణ, చికిత్సపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హెచ్‌ఐవీపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి శాస్త్రీయ సమాచారాన్ని విస్తృతంగా చేరవేయాల్సిన అవసరం ఉందన్నారు. హెచ్‌ఐవీ నిర్ధారణ అయిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వైద్యుల సూచనల మేరకు చికిత్స తీసుకుంటూ మందులను క్రమం తప్పకుండా వినియోగిస్తే వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవచ్చని తెలిపారు. అనుమానం ఉన్నవారు, ప్రమాదకర పరిస్థితులకు గురైన వారు సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
ఏపీ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్టు డైరెక్టర్ బి. స్మరణ్ రాజ్ మాట్లాడుతూ హెచ్‌ఐవీతో జీవిస్తున్న వారికి సమాజం అండగా నిలవాలని, వివక్షకు తావివ్వకుండా మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కోరారు. యువతకు సరైన సమాచారం అందించడం ద్వారా ఆరోగ్యంపై బాధ్యతను పెంచవచ్చన్నారు. ప్రభుత్వ శాఖలు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్ శ్రవణ్‌బాబు, అదనపు డీఎంహెచ్‌వో భానునాయక్, ఐఈసీ జేడీ మంజుల, నర్సింగ్ విద్యార్థినులు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
