జహీరాబాద్ రోడ్డు ప్రమాదంపై హరీశ్‌రావు దిగ్భ్రాంతి..
- మృతుల కుటుంబాలను ఆదుకోవాలి..
- క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి
హైదరాబాద్, ఆంధ్రప్రభ : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం సత్వార్ గ్రామ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉపాధి కోసం ఆటోలో వెళ్తున్న కూలీలను ట్యాంకర్ ఢీకొట్టిన ఘటన అత్యంత బాధాకరమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఆరుగురు కూలీలు మృతి చెందడం పట్ల విచారం వ్యక్తం చేసిన హరీశ్‌రావు.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కర్ణాటకలోని రాజగిరికి చెందిన కూలీలు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. పొట్టకూటి కోసం వచ్చిన నిరుపేద కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి ప్రభుత్వం వెంటనే మెరుగైన వైద్య సేవలు అందించాలని హరీశ్‌రావు కోరారు. మృతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆదుకోవాలని, తక్షణమే ఎక్స్‌గ్రేషియా ప్రకటించి వారికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.
