CSR నిధులతో చెరువుల అభివృద్ధికి పిలుపు

హైదరాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : నగరంలోని చెరువుల అభివృద్ధి, పునరుజ్జీవనంలో కార్పొరేట్‌ సంస్థలు భాగస్వాములు కావాలని మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ పిలుపునిచ్చింది. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత నిధులతో చిన్న చెరువులను అభివృద్ధి చేసేందుకు సంస్థలు ముందుకు రావాలని కోరింది.

ఎంఏయూడీ, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎస్‌ఆర్‌ రౌండ్‌టేబుల్‌ 2.0 కార్యక్రమంలో ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్‌ రంజన్‌, హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ పాల్గొన్నారు. నగరంలోని చిన్న చెరువుల అభివృద్ధికి సీఎస్‌ఆర్‌ నిధులను వినియోగించేందుకు కార్పొరేట్‌ సంస్థలు సహకరించాలని వారు సూచించారు.

నగర పర్యావరణ సమతుల్యతను కాపాడటంతో పాటు భవిష్యత్‌ నీటి అవసరాలను తీర్చడంలో, వరదల నియంత్రణలో చెరువులు కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు వివరించారు. చెరువులను సంరక్షించడం ద్వారా హైదరాబాద్‌ను మరింత సుస్థిర నగరంగా తీర్చిదిద్దవచ్చని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ఇప్పటికే చేపట్టిన మొదటి, రెండో దశ చెరువుల అభివృద్ధి పనులను వివరించారు. మూడో దశలో చేపట్టనున్న చెరువుల అభివృద్ధి కార్యక్రమానికి కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వెల్లడించారు.

నగరంలోని చెరువులను మరింత అభివృద్ధి చేసి భవిష్యత్‌ తరాలకు సంరక్షించేందుకు ప్రభుత్వ సంస్థలతో పాటు కార్పొరేట్‌ సంస్థలు, ప్రజలు కూడా భాగస్వాములు కావాలని రంగనాథ్‌ కోరారు. సీఎస్‌ఆర్‌ నిధుల ద్వారా చిన్న చెరువుల అభివృద్ధికి సంస్థలు సహకరిస్తే పర్యావరణ పరిరక్షణతో పాటు సుస్థిర హైదరాబాద్‌ నిర్మాణానికి మరింత ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.